అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్యపరమైన పరిమితులు, అడ్డగింపులు తట్టుకుని గత అరవైయేండ్లుగా క్యూబా నిలబడ్డది. కాలంచెల్లిన ఈ నిర్బంధం దుర్మార్గమైంది. దీన్ని కొనసాగించడమంటే మా దేశ విప్లవానికి మా ప్రజల మద్దతు అందకుండా చేసి గొంతు నులిమేయడమే. ఆ విధంగా క్యూబాను మళ్లీ అమెరికా వలసగా మార్చడం. క్యూబా ఎన్నడూ చేతులు ముడుచుకుని కూచోలేదు. మా దేశం ఒక సృజనాత్మక ప్రతిఘటనకు శ్రీకారం చుట్టడమే గాక ఒక జాతిగా పురోగమించడానికి ప్రయత్నిస్తున్నది.
గత ఐదేండ్లుగా మాదేశంపై అమెరికా తన పట్టు మరింతగా బిగించింది. కోవిడ్ మహమ్మారి విరుచుకు పడుతున్న కాలంలో కొనసాగిన ఈ దిగ్బంధనం దేశాన్ని ఆర్థికపరంగా ఇబ్బందులపాలు చేయటమేగాక ఆరోగ్య రంగంలో దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయంగా, రాజకీయ భౌగోళిక పరిస్థితుల్లో వస్తున్న మార్పుల నేప థ్యంలో ఈ దిగ్బంధం కొనసాగింది. ఇవన్నీ క్యూబాపై పెనుప్రభావం చూపాయి. 2019 వరకూ క్యూబా ప్రజల జీవి తాలు అంతకుముందు, ఆ తర్వాత ఎలా ఉన్నాయో చూస్తే ఈ దిగ్బంధం తీవ్రత అర్థమవుతుంది. 2019 వరకు క్యూబాకు ఎగుమతుల ఆదాయం ఉండింది. దీన్లో ప్రధాన భాగం విదేశాల నుండి చెల్లింపులుండేవి. టూరిజంపై ఆదాయం నిలకడగా ఉండేది. ఏడాదికి ఐదులక్షల మంది టూరిస్టులు వచ్చేవారు. ఇతర దేశాల నుండి, ఆర్థిక సంస్థల నుండి ఏజెన్సీల నుండి నిధులు వచ్చేవి. దేశంలో అభివృద్ధి పనులకు ఇవి ఉపయోగపడేది. మిత్ర దేశాల నుండి పరిహారంగా (కంపెన్సేటరీ) వచ్చే ఇంధన సప్లయిలుండేవి.
ఈ పరిస్థితిలో, ప్రధాన సరుకుల ఉత్పత్తికి అవసరమైన దిగుమతులకి విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉండేది.ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వానికి అవకాశముండేది. చట్టపరమైన చెల్లింపులుగానీ, నికర విదేశీ మార్కెట్ అవసరాలు తీర్చడానికి గానీ విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉండేది. ఇది ఆర్థికపరమైన లావాదేవీలకు, ఆర్థిక వ్యవస్థలో కీలకమైన విడిభాగాల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడేది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండేది.
స్థూలంగా చూస్తే, దేశం ఆశించిన స్థాయిలో కాకున్నా, కొంతనిలకడైన స్థితి ఉండేది. 2030 వరకు జాతీయ ఆర్థిక, సాంఘిక అభివృద్ధి ప్రణాళిక సాధనకు ఉపయుక్తంగా ఉండేది. 2019 ద్వితీయార్థంలో ట్రంపు ప్రభుత్వం క్యూబా దిగ్బంధనాన్ని మరింత బిగించేలా 240 కంటే ఎక్కువ పద్ధతులను అమలు జరిపింది. దీనివల్ల హఠాత్తుగా విదేశీ మారక ద్రవ్యం రాకపై పెద్ద ప్రభావం పడింది. పర్యాటకరంగం బాగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం వినోదానికి ఉపయోగించే నౌకలు (క్రూయజ్‌లు) అందుబాటులో లేకపోవడమే! ఇంధన కొనుగోళ్లకు చాలా పైకం వినియోగించాల్సి వచ్చింది. ఇది ప్రజలపై ఆర్థిక పీడనగా మారింది. బయటి నుండి వచ్చే చెల్లింపులు ఆగిపోయాయి. ఇది విద్యుత్‌రంగంపై పెద్ద ప్రభావం చూపింది.దేశంలో బ్లాకేట్లు సర్వసాధారణమైపోయాయి. పరిశ్రమలు మాత బడ్డాయి. ప్రజలపై పెద్ద ప్రభావం పడింది.
అడుగడుగునా ఆర్థిక దిగ్బంధనం
శ్వేతసౌధం నుండి నిష్క్రమించే ముందు ట్రంప్ క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ముద్ర వేశాడు. దాంతో ఆర్థిక సంస్థలు అప్పులివ్వడాన్ని ఆపేశాయి. విదేశీ మారక చెల్లింపులు చేయలేక క్యూబా ఇక్కట్ల పాలైంది. విద్యుత్ స్థాపిత సామర్థ్యానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను నడపడానికి ఇబ్బందులొచ్చాయి. దాంతో ప్రజలకవసరమైన సరుకులు, సేవలు అందించడం కష్టమైంది. డిమాండు, సప్లయిల మధ్య అంతరం ఏర్పడింది. ధరలు పెరిగిపోయాయి.ద్రవ్యోల్బణం పెరిగింది. విదేశీ మారకద్రవ్యం కొరత వల్ల చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్వహించే ఎక్సేంజి మార్కెట్ నిర్వహణకు ఇబ్బందులేర్పడినాయి. దాంతో చట్టవిరుద్ధగాళ్లు ప్రవేశించి ధరలు నిర్ణయిస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. క్యూబా ఆర్థిక దిగ్బంధ నేపథ్యం, దాని పర్యవసానాలివి. క్యూబా కూడా కోవిడ్ మహమ్మారి దెబ్బకు గురైంది. అంతర్జాతీయ మార్కెట్ సంక్షోభం వల్ల మందుల ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు పర్యావరణ మార్పులు సంభవించాయి. కరువులు, అధిక వానలు ఉధృతమయ్యాయి. వెరసి, ఇవన్నీ దేశఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయి.
వీటన్నిటి ఫలితంగా దేశంలో మందుల ధరలు పెరిగాయి. ఇంధనానికి కొరత ఏర్పడింది. క్యూబా విప్లవం స్వప్నించిన సంక్షేమ కార్యక్రమాలకు బ్రేకుపడింది. ఆ విధంగా ఆర్థిక దిగ్బంధనం క్యూబా దేశ పురోభివృద్ధికి ప్రతి బంధకంగా మారింది. దీని తీవ్రత గత నాలుగేండ్లలో మరింత తీవ్రమైనది. ట్రంప్ కాలంలో ప్రారంభమైన ఈ స్థితి ఆ తర్వాత బైడెన్ కాలంలోనూ కొనసాగింది. దేశంలో ఆక్సిజెన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు దెబ్బతిన్న సమయంలో ప్రపం చంలో ఏ కంపెనీ వారూ క్యూబాకు ఆక్సిజెన్ సప్లయి చేయకుండా అమెరికా పాలకులు అడ్డుకున్నారంటే దిగ్బంధం తీవ్రత ఏ స్థాయిలో, ఎంత నిర్దాక్షిణ్యంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఎటువంటి షరతులు లేకుండా అమెరికాతో సమాన హోదాలో చర్చలు జరుపుదామని క్యూబా ప్రభుత్వం ప్రత్యక్షంగానూ, పరోక్ష ఛానెల్స్ ద్వారా విజ్ఞప్తి చేసింది. కాని అమెరికన్ పాలకులు క్యూబా యెడల తన వైఖరిని విడనా డటానికి సిద్ధంగా లేరు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా ఇరుగుపొరుగు దేశాల మధ్య నాగరికమైన సంబంధాలు ఉండేలా చూడటానికి అమెరికా సిద్ధపడటంలేదు. రెండు దేశాలూ సహకరించుకోవాలని, శాస్త్రీయ, సాంస్కృతిక సంబంధాలు మెరుగు పరుచుకోడానికి ప్రయత్నించాలని క్యూబా వాదన.
సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం
ఇవన్నీ నిరర్ధకమని తేలిన తర్వాత ఈ దిగ్బంధనం వీడాలంటే క్యూబా తన ప్రయత్నాలు తాను చేసు కోవాలని నిర్ణయించుకుంది. మానవ వనరులపైనా, వారి శక్తియుక్తులపైనా ఆధారపడి అందుకు అవసరమైన ప్రయత్నాలు విప్లవానంతర అరవై యేండ్లలో క్యూబా నేర్చుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రత్యేకించి సోలార్ విద్యుత్‌పై, అందునా కాంతిశక్తిని విద్యుత్‌గా మార్చే ‘ఫోటో వోల్టెయిక్’ ప్రక్రియ ద్వారా విద్యుత్ తయారీపై క్యూబా కేంద్రీకరించింది. ఆ విధంగా హైడ్రోకార్బన్‌లపై (బొగ్గు, డీజిల్) ఆధారపడటాన్ని తగ్గించుకుంది. ప్రస్తుతం రెండువేల మెగావాట్ల ఫొటోవోల్టెయిక్ సోలార్ పార్కుల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకొంది. ఆ విధంగా చాలినంత ఇంధనం ఆహార పదార్థాల తయారీకి మిగుల్తోంది. దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తికి, దాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ విధంగా ఎగుమతికి కొత్త సరుకులు లభ్యమయ్యాయి.
ఈ సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సైతం ఆరోగ్యరంగంలో కీలక ఆవిష్కరణలు చేసింది క్యూబా. ఇంకా అనేకం లైన్లో ఉన్నాయి. కోవిడ్ వ్యతిరేక పోరాటంలో క్యూబా విప్లవానికి అనుగుణంగా మానవతా దృక్పథంతో కృషి చేసింది. దేశంలో అందుబాటులో ఉన్న ఏ కాస్త డబ్బునైనా మానవ జీవితాలను కాపాడటానికే వినియోగించింది. క్యూబా తన సైంటిస్టుల, బయో ఫార్మా పరిశ్రమ పుణ్యాన తాను సొంతంగా తయారు చేసుకున్న వాక్సిన్లను తన జనాభా అంతటికి ఇవ్వగలిగింది. దిగ్బంధనంలో ఉన్న ఒక దేశం ఆ విధంగా చేయగలగడం ఒక అద్భుతమేగా! కోవిడ్ వచ్చిన మొదటి మూడు నెల్లలోనే ఒక వాక్సిన్ తయారుచేసిన క్యూబా ఆ తర్వాతి కాలంలో ఐదు రకాల వాక్సిన్లను తయారుచేసింది. అవి తమ శక్తి సామర్థ్యాలలో ఏ ఇతర వాక్సిన్లకు తీసిపోవని రుజువైంది. ఇవి క్యూబా ఆరోగ్య సమర్థతకు రుజువులుగా నిలిచాయి. క్యూబా ఆరోగ్య రంగంలో తన చారిత్రక బాధ్యతలకు కట్టుబడి నలభైఆరు దేశాలకు తన వైద్య సిబ్బందినీ, ఆరోగ్య కార్యకర్తలనూ పంపింది. అందులో ఆనాడు ఈ మహమ్మారి ఆవిర్భావానికి కేంద్రంగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయని మరువరాదు.నేడు క్యూబా జీవ సాంకేతిక రంగంలో మందులు కనుగొని ఆల్జీమర్స్, పార్కిన్‌సన్స్‌తోపాటు, కేన్సర్ వంటి రోగాలను నయం చేయగల చికిత్సా విధానంపై కేంద్రీకరించి పని చేస్తున్నది. దాంతోపాటే డెంగ్యూ వంటి రోగాలకు వాక్సిన్లను కనుగొనే చివరి దశలో ఉంది.
అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా క్యూబన్‌ల పోరాటం విశాల అంతర్జాతీయ సౌహార్థతను, మద్దతునూ కూడగడుతున్నది. గత మూడు దశాబ్దాలుగా ప్రతి యేడాదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మంచి విజయాలు సాధిస్తున్నది. ఇజ్రాయిల్ వంటి కొన్ని దేశాల గైర్హాజరు తప్ప 180 కంటే ఎక్కువ దేశాల మద్దతు క్యూబాకు లభిస్తు న్నది. అయినా అమెరికా వెనక్కి తగ్గట్లేదు. దిగ్బంధనాన్ని ఎత్తేయట్లేదు. కారణం దాని తల పొగరేగాక ప్రపంచా భిప్రా యానికి విలువనివ్వనితనం కూడా! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ దిగ్బంధనాన్ని ఖండించే దేశాధినేతలు ఏటా పెరుగుతున్నారు.తాజాగా జరిగిన చర్చలో నలభైనాలుగు దేశాలు సూటిగా దిగ్బంధనాన్ని విమర్శించాయి. దేశాలు, ప్రాంతీయ కూటములు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ దిగ్బంధనాన్ని విమర్శించడం పెరుగుతున్నది. అనేక దేశాల్లో దీన్ని ఖండిస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి. క్యూబాకు మద్దతుగా రెండువేల ప్రదర్శనలు జరిగాయి.
(క్యూబా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఆ దేశ అధ్యక్షులు మిర్వెల్ మారియో డియాజ్ బెర్ముడెజ్ స్పానిష్ ప్రొఫెసర్, జర్నలిస్టు అయిన ఇగ్నాషియో రామోనెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ…)
స్వేచ్ఛానువాదం : ఆరెస్బీ
క్యూబా ఎన్నడూ చేతులు ముడుచుకుని కూచోలేదు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES