Sunday, November 2, 2025
E-PAPER
Homeఆటలుచరిత్ర సృష్టించేదెవరు?

చరిత్ర సృష్టించేదెవరు?

- Advertisement -

మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
టైటిల్‌ వేటలో భారత్‌, దక్షిణాఫ్రికా ఢీ
మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నేడు

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ అంతిమ ఘట్టానికి చేరుకుంది. మహిళల క్రికెట్‌ అగ్ర జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను సెమీఫైనల్లో ఓడించిన భారత్‌, దక్షిణాఫ్రికాలు నేడు టైటిల్‌ పోరులో ఢీకొట్టనున్నాయి. దక్షిణాఫ్రికాకు ఇది తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ కాగా.. 2005, 2017 తర్వాత భారత్‌ మూడోసారి టైటిల్‌ పోరుకు సై అంటోంది.

ఇటు భారత్‌, అటు దక్షిణాఫ్రికా చరిత్రకు అడుగు దూరంలో నిలిచాయి. సొంతగడ్డపై అచ్చొచ్చిన డివై పాటిల్‌ స్టేడియంలో అశేష అభిమానుల నడుమ ప్రపంచకప్‌ టైటిల్‌ ముద్దాడాలని టీమ్‌ ఇండియా ఎదురుచూస్తుండగా.. వరల్డ్‌కప్‌ టైటిల్‌ విజయంతో సఫారీ క్రికెట్‌ చరిత్రను సరికొత్త పంథాలో నడిపించేందుకు దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది.

మహిళల క్రికెట్‌ను శాసించే ఆర్డర్‌ మారుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు ప్రపంచకప్‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాయి. తొలిసారి ఈ రెండు జట్లు లేకుండా ప్రపంచకప్‌ ఫైనల్‌ జరుగుతోంది. క్రికెట్‌ ఛోకర్స్‌గా ముద్రపడిన దక్షిణాఫ్రికా.. అగ్రజట్టు హౌదాకు ఓ టైటిల్‌ దూరంలో నిలిచిన భారత్‌ నేడు ముంబయిలో చరిత్రకు అడుగు దూరంలో నిలిచాయి. నేడు ఫైనల్లో ఎవరు నెగ్గినా… ప్రపంచ మహిళల క్రికెట్‌కు కొత్త చాంపియన్‌ ఖాయం.


నవతెలంగాణ-ముంబయి : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియంలో నేడు భారత్‌, దక్షిణాఫ్రికా ఐసీసీ కిరీటం కోసం పోటీపడేందుకు సై అంటున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి తొలిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకోగా.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి భారత్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఇది. తొలిసారి ప్రపంచకప్‌ విజయంతో చరిత్ర సృష్టించాలని భారత్‌, దక్షిణాఫ్రికా ఎదురుచూస్తున్నాయి. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నేడు.

అదే జోరు ఇంకొక్కసారి
ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో భారత్‌ ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఆసీస్‌, ఇంగ్లాండ్‌ సహా దక్షిణాఫ్రికాలు హర్మన్‌ప్రీత్‌ సేనపై విజయం సాధించాయి. దీంతో సెమీఫైనల్లో ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్‌పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఒత్తిడిలో టీమ్‌ ఇండియా అద్వితీయ ప్రదర్శన చేసింది. 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పింది. గ్రూప్‌ దశలో అంతగా రాణించని జెమీమా రొడ్రిగస్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు సెమీఫైనల్లో అద్భుతంగా ఆడారు. ఫైనల్లోనూ జెమీమా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు బ్యాట్‌తో మెరిస్తే నేడు భారత్‌కు తిరుగుండదు. బ్యాటింగ్‌ లైనప్‌లో స్మతీ మంధాన, హర్లీన్‌ డియోల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. యువ ఓపెనర్‌ షెఫాలీ వర్మ సెమీస్‌లో నిరాశపరిచినా.. నేడు టైటిల్‌ పోరులో ఇరు జట్లకు ‘వ్యత్యాసం’గా నిలిచే అవకాశం లేకపోలేదు. ఎక్స్‌ ఫ్యాక్టర్‌ షెఫాలీ వర్మపై భారత్‌ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, స్నేహ్‌రానా, అమన్‌జోత్‌ కౌర్‌లు బంతితో, బ్యాట్‌తో కీలకం కానున్నారు. బౌలింగ్‌ విభాగంలో క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే టైటిల్‌ పోరుకు భారత్‌కు ఎదురుండదు.

ఒత్తిడి లేని సఫారీలు !
దక్షిణాఫ్రికా అనగానే ఒత్తిడిలో విజయాన్ని వదిలేస్తారనే చెప్తారు. కానీ ఈ ప్రపంచకప్‌లో సఫారీలు సరికొత్తగా ఆడారు. ప్రతికూల పరిస్థితుల్లో, ఒత్తిడిలో ఆ జట్టు గొప్పగా రాణించింది. గ్రూప్‌ దశలో భారత్‌ను, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను సాధికారికంగా ఓడించింది. సమిష్టిగా రాణించటమే సఫారీ జట్టు అతిపెద్ద బలం. దీంతో నేడు దక్షిణాఫ్రికా ఎటువంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతోంది. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడకపోవటం అతిపెద్ద సానుకూలతగా మారింది. లారా, బ్రిట్స్‌, బాచ్‌, జాఫ్టా, డిక్లర్క్‌, మలాబాలు దక్షిణాఫ్రికాకు కీలకం కానున్నారు.

మూడోసారైనా మెరుస్తారా?
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడటం భారత్‌కు కొత్త కాదు. గతంలో రెండు సార్లు భారత్‌ టైటిల్‌ పోరులో పోటీపడింది. 2005లో ఆస్ట్రేలియా, 2017లో ఇంగ్లాండ్‌లు భారత్‌కు టైటిల్‌ దక్కకుండా చేశాయి. రెండు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత్‌.. ముచ్చటగా మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచేందుకు ఎదురుచూస్తోంది. సెమీఫైనల్లో అగ్ర జట్టు ఆస్ట్రేలియాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన రెట్టించిన ఉత్సాహంలో ఉన్న టీమ్‌ ఇండియా నేడు ఫైనల్లో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత క్రికెటర్లకు మంచి అవగాహన ఉన్న డివై పాటిల్‌ స్టేడియం ఫైనల్‌ వేదిక కావటం టీమ్‌ ఇండియాకు మరో అనుకూలత.

కొత్త చాంపియన్‌
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ కొత్త చాంపియన్‌ చూడనుంది. ఇప్పటివరకు మహిళల క్రికెట్‌ను, ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు శాసించాయి. ఆస్ట్రేలియా ఏడు సార్లు చాంపియన్‌గా నిలువగా.. ఇంగ్లాండ్‌ నాలుగుసార్లు వరల్డ్‌కప్‌ విజేతగా అవతరించింది. ఓ సారి న్యూజిలాండ్‌ కప్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఇది. ఇటు భారత్‌, అటు దక్షిణాఫ్రికా తొలిసారి ప్రపంచకప్‌ విజేతగా నిలిచేందుకు పట్టుదలగా ఉన్నాయి.

పిచ్‌, వాతావరణం
నవీ ముంబయిలోని డివై పాటిల్‌ స్టేడియం సంప్రదాయ బ్యాటింగ్‌ పిచ్‌. ఇక్కడ జరిగిన సెమీఫైనల్లోనూ బ్యాటర్లదే పైచేయి. నేడు ఫైనల్‌ మ్యాచ్‌కు సైతం పిచ్‌ సిద్దమైంది. కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా వర్షం సూచనలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే అందుబాటులో ఉంది. నేడు మ్యాచ్‌ మొదలయ్యాక వర్షంతో ఆగిపోతే.. సోమవారం రోజు మ్యాచ్‌ పున ప్రారంభం అవుతుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : స్మతీ మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగస్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), ఆమన్‌జోత్‌ కౌర్‌, రాధ యాదవ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి, రేణుక సింగ్‌.
దక్షిణాఫ్రికా : లారా (కెప్టెన్‌), బ్రిట్స్‌, అనెకా బాచ్‌, సునె లుస్‌, మారిజానె కాప్‌, సినాలో జాఫ్ట (వికెట్‌ కీపర్‌), అనెరీ డెర్క్‌సన్‌, చోలె ట్రయాన్‌, నదినె డిక్లర్క్‌, అయబోంగ కాకా, నాన్‌కులులెకో మలాబా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -