సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది రాజేశ్ కిషోర్ చెప్పు విసిరి దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి దిగ్భ్రాంతికరమని తెలిపింది. అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు తీర్పులివ్వడం, వ్యాఖ్యానాలు చేసే వైఖరి ఉంటుందని తెలిపారు. కానీ మనువాద, మతోన్మాద, ఆధిపత్య ధోరణులకు, సనాతన ధర్మానికి, లేదా ఇతర మతాలకు అనుకూలమైన రీతిలో తీర్పులుండాలనే రెచ్చగొట్టే వైఖరి సరైందికాదని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక శక్తులను అవమానించే ఘటన అని తెలిపారు. కుల అసమాతనలు, మతోన్మాద రాజకీయాలు, మూఢ విశ్వాసాన్ని పెంచి పోషించే విధంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నదని పేర్కొన్నారు. గతంలో బీజేపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా సిద్ధిపేట జిల్లాలో కొంత మంది ఆధిపత్య కులాల న్యాయవాదులు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యానాలు చేశారని తెలిపారు. గాంధీని హత్యచేసి హంతకులైన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈనాడు దేశ భక్తులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజే వారిని దేశ ప్రధానమంత్రే కీర్తిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలకు భయపడే సమస్య లేదంటూ ప్రధాన న్యాయమూర్తి చెప్పడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ, సామాజిక న్యాయం కోరే, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే శక్తులన్నీ ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇలాంటి దాడులను సంఘటితంగా వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి దిగ్భ్రాంతికరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES