Saturday, July 19, 2025
E-PAPER
Homeఆటలునత్తనడకన టెస్టు క్రికెట్‌

నత్తనడకన టెస్టు క్రికెట్‌

- Advertisement -

– ఐసీసీకి సమస్యగా స్లో ఓవర్‌రేట్‌
‘స్లో ఓవర్‌ రేట్‌’.. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో ఎవరూ ఊహించని సమస్యగా మారింది. టెస్టు క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌ ఏండ్లుగా సాగుతున్న చర్చ. టెస్టు మ్యాచ్‌ ఐదో రోజు 90 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు కచ్చితమైన రూల్స్‌ రూపొందించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ).. తొలి నాలుగు రోజుల ఆటలో నిర్ధిష్టమైన నిబంధనలు పొందుపరచలేదు. టెస్టు క్రికెట్‌లో నిలకడగా ఫలితాలు వస్తున్నా.. స్లో ఓవర్‌ రేట్‌ ఇటు క్రికెటర్లను, అటు ఆటగాళ్లను చికాకు పెడుతోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్‌, ఇంగ్లాండ్‌ లార్డ్స్‌ టెస్టు మూడో రోజు 72.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. ఇన్నింగ్స్‌ మార్పు, డ్రింక్స్‌ విరామం సహా ఇతరత అంశాలను పరిగణనలోకి తీసుకున్నా 15 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. వర్షం అంతరాయం, వెలుతురు లేమి సమస్యలేమీ అందుకు కారణం కాదు. ఆట నత్త నడకన సాగటమే ప్రధాన సమస్య. లార్డ్స్‌ టెస్టులో మూడు, నాల్గో రోజు మరో 19 ఓవర్ల ఆట వృథా అయ్యింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ ఉద్దేశపూర్వకంగా ఆటకు ఆటంకం కలిగిస్తూ.. ఒక్క ఓవర్‌కే ఏడు నిమిషాల పట్టేలా చేశాడు. జాక్‌ క్రాలీ తీరు పట్ల భారత ఆటగాళ్లు, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తీవ్ర అసహన వ్యక్తం చేశారు. అంతిమంగా, స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మ్యాచ్‌ రిఫరీ ఇంగ్లాండ్‌పై కొరడా ఝులిపించాడు. ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోతతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లలో రెండు పాయింట్లు కోత పెట్టాడు. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 8 నిమిషాల ఫిజియో బ్రేక్‌, రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ మధ్యలో టాయిలెట్‌ బ్రేక్‌ను మినహాయించినా.. ఇంగ్లాండ్‌ స్లో ఓవర్‌ రేట్‌ కింద జరిమానాకు గురైంది. ఐదు రోజుల టెస్టు క్రికెట్‌లో నిలకడగా ఫలితాలు రావటం శుభపరిణామం. కానీ, స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా తొలి నాలుగు రోజుల్లో టెస్టు క్రికెట్‌ అభిమానుల సహనానికి పరీక్షగా నిలుస్తున్నది. స్లో ఓవర్‌ రేట్‌ను కట్టడి చేయటం ఐసీసీకి సమస్యగా మారింది.

రూల్స్‌ ఏం చెబుతున్నాయి
ఐదు రోజుల టెస్టు క్రికెట్‌లో ప్రతి రోజూ 90 ఓవర్ల ఆట సాగాలి. జట్లు డ్రా కోసం కావాలనే సమయాన్ని వృథా చేయడాన్ని నివారించేందుకు.. ఐదో రోజు ఆటలో కచ్చితంగా 90 ఓవర్లు వేయాలనే నిబంధన విధించారు. వాతావరణ పరిస్థితులు ఇందుకు మినహాయింపు. కానీ తొలి నాలుగు రోజుల్లో ఆరు గంటల వ్యవధిలో ఓవర్లను పూర్తి చేయాలి. అవసరమైతే మరో అర గంట సమయాన్ని వాడుకోవచ్చు. వాతావరణ పరిస్థితుల్లో కోల్పోయిన సమయాన్ని, ఓవర్లను భర్తీ చేసేందుకు రూల్స్‌ ఉన్నాయి. కానీ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు ఎటువంటి నిబంధనలు లేవు. స్లో ఓవర్‌ రేట్‌ను కట్టడి చేసేందుకు ఐసీసీ జరిమానాలు విధిస్తున్నా.. పెద్దగా ప్రభావం ఉండటం లేదు. ఓ జట్టు ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృథా చేస్తుందని అంపైర్‌ భావిస్తే పెనాల్టీ విధిస్తూ ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులను ఇవ్వవచ్చు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో ఈ రూల్‌ను అమలు చేయలేదు. ఓవర్ల మధ్య కాలయాపనను నివారించేందుకు స్టాప్‌క్లాక్‌ను తీసుకొచ్చారు. ఇక్కడా రెండు హెచ్చరికల తర్వాత అంపైర్‌ ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వవచ్చు. కానీ భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో అంపైర్లు హెచ్చరికలకే పరిమితం అయ్యారు. ఐదు పరుగుల పెనాల్టీ రూల్‌ను అమలు చేయలేదు. కెప్టెన్‌పై జరిమానా, డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత ఐసీసీ అనుసరిస్తున్న ప్రధాన రూల్స్‌. కానీ ఇవేవీ స్లో ఓవర్‌ రేట్‌ను నిలువరించటం లేదు. ఆలస్యమైన ప్రతి ఓవర్‌కు ఓ పాయింట్‌ను కోత పెడుతున్నా.. ఎటువంటి మార్పు లేదు. 2023-25 ఐసీసీ డబ్ల్యూటీసీ సైకిల్‌లో స్లో ఓవర్‌ రేట్‌తో ఇంగ్లాండ్‌పై ఏకంగా 22 పాయింట్ల కోత పడింది. అయినా, ఆ జట్టు ఓవర్ల కోటాను నిర్దేశిత సమయంలో పూర్తి చేయటంపై దృష్టి నిలపటం లేదు.

ఎందుకీ స్లో సమస్య
స్లో ఓవర్‌ రేట్‌ చర్చ టెస్టు క్రికెట్‌కు కొత్త కాదు. టెస్టు క్రికెట్‌ చరిత్రను పరిశీలిస్తే ప్రతి గంటకు వేయాల్సిన సగటు ఓవర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అంపైర్‌ రివ్యూలు, ప్లేయర్‌ రివ్యూలు (డిఆర్‌ఎస్‌), బౌండరీ చెక్స్‌, కంకషన్‌ ప్రోటోకాల్స్‌ సహా కమర్షియల్‌ టీవీ బ్రేక్‌ ఇందుకు కారణమని చెప్పవచ్చు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు గంటకు 21 ఓవర్ల ఆట సాగేది. 1945-1974లో ఇది 18 ఓవర్లకు పడిపోయింది. 1975-1999 వరకు 14.3 ఓవర్లకు దిగజారింది. 2000 నుంచి గంటకు 14 ఓవర్లు మాత్రమే సాధ్యపడుతుంది. ఆట నత్త నడకన సాగేందుకు మరో కారణం.. ఇరు జట్లు తరచుగా బంతిని మార్చాలని కోరటం. కొన్ని ఓవర్లకే బంతి మెత్తగా అవటం, స్వరూపం మారటంతో అంపైర్లు బంతిని చెక్‌ చేయటం.. అవసరమైతే బాల్‌ బాక్స్‌లో మరో బంతిని అందించటం చూస్తున్నాం. విరామ సమయాలు సైతం సుదీర్ఘంగా ఉంటున్నాయి. లార్డ్స్‌ టెస్టు రెండో రోజు తొలి డ్రింక్స్‌ విరామం ఆరు నిమిషాలు సాగింది. కానీ రూల్స్‌ ప్రకారం డ్రింక్స్‌ బ్రేక్‌ 4 నిమిషాలే. స్వల్ప గాయాలకు సైతం సుదీర్ఘ బ్రేక్‌లు తీసుకోవటం సైతం ఆట నెమ్మదిగా సాగేందుకు కారణం అవుతోంది.

సమస్యను చక్కదిద్దేదెలా?
టెస్టు క్రికెట్‌ నత్తనడకన సాగటంపై ఆటగాళ్లపై నింద సరికాదు. ఓ రోజు ఆటలో 90 ఓవర్లు పడేలా చూడటం ఐసీసీ, అంపైర్ల బాధ్యత. అందుకు ఓ అర గంట ముందుగానే ఆటను మొదలెట్టడం ఓ మార్గం. ఐదో రోజు తరహాలోనే ప్రతి రోజు ఆటలో కచ్చితంగా 90 ఓవర్లు వేయాలనే రూల్‌ తీసుకురావాలి. అంపైర్లు రూల్స్‌ ప్రకారం పెనాల్టీలను ఎప్పటికప్పుడు విధించాలి. డ్రింక్స్‌ బ్రేక్స్‌, ఇంజూరీ బ్రేక్స్‌కు స్టాప్‌క్లాక్‌ను వాడాలి. జట్లు ప్రణాళికబద్దంగా క్వాలిటీ బౌలింగ్‌తో పాటు వేగంగా ఓవర్ల పూర్తిపైనా దృష్టి సారించాలి. ఐసీసీ సైతం ఆటలో వేగం పెంచేందుకు నిపుణులతో చర్చించి సరికొత్త మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -