ఏంది సిన్నమ్మ జగదీసు ఇస్కుల్కి పోతలేడా? ఎప్పట్సంది? ఎందుకంట? కిలాసులో కూసొని సారు పాటం చెప్తంటే ఇనక తిక్కమాటలు కోతి సాతలు చేస్తాంటే సారు యాస్టకొచ్చి బయటికి దొబ్బిండ, తోటి పోరగాళ్లు నవ్విన్రని ఈ దొరకు రోసం ఒచ్చినాది?
నువ్వెమ్ బుగుల్పడకు, నేను సీద జేస్త. అగో ఒస్తుండు గద దొర. ఎండకు మొకం అంత మార్చుకుని కడ్పు గాలిందేమొ తినిపోడాని అస్తుండేమొ ఇల్లు గుర్తుచ్చిందేమొ.
ఏం జెగ్దిస్ బేట! యాడ్నుండోస్తున్నవ్ ముకం గుంజుక పోయింది ఎప్పడెల్లినవ్ ఇంటి నుండి? కాల్సేతులు కడ్కోని ముందు ఇంత దిను. సిన్నమ్మ ముందు అన్నం దినవెట్టు నీ కొడ్కుకి.
తిన్నవా.. చెయ్యి, మూతి కడ్కోని ఇగరా. సూడు ఇస్కుల్కు ఎందుకు పోతలేవ్ చెప్పు, నీవు మాట తప్పించుకు నాకంత ఎర్కనే. నేను ఇస్కుల్ల అర్సుకున్న మీ దోస్తులు కూడ సెప్పిండ్రు, నివ్వు కిలాసుల కోతి సాతలు సెయ్యడం నీ తప్పు. నీకు పాటాలు చెప్పనీకె దూరం నుండి సార్లు, టీచర్లు ఒస్తుంటే మీరు కిలాసుల ఇస్వంటి పనులు చేస్తుంటే యాస్టకు రాద? నివ్వు ఇనవంట, పక్కోని ఇయనీయవంట. తప్పు నీకాడ పట్కుని రోసుపడ్తె ఎవర్కి నష్టం? ఆ వంక పెట్టి యిస్కుల్కు పోవడం మానేసి, రోడ్ల పోట తిరుగుతున్నవ్!
రేపటి సంది ఇస్కుల్కి పోవాలె ఏంది? రేపు సుట్టినా! ఎందుకంట? ఏమి తెల్వద? చుట్టి ఎందుకో తెల్సున, అంబెత్కర్ సాబు పుట్టినదినం. ఆయనెవరని అడ్గుతున్నావ్? నీ యసంటోడు గాడు. తన తప్పేమ్ లేకున్న సదువు మీద ఇంటరెస్టుతో ఇస్కుల్లకు తోల్కపోతె బతిమిలాడి జాయిన్ అయి, చిన్న కులపోడని అందర్పక్కన, బేంచిల మీద కుసోనియకుంటే దూరంగ తల్పుకాడ నేలమీద కుసొని సద్వి, బేంచిల మీద కూసున్న పెద్ద కులపోల్ల కన్న ఎక్వ మార్కులు తెచ్చుకుండు.
గాదినాల్ల పెద్దకులపోల్లకి ఎదుర్పడ్డ తప్పె, తలెత్తి చూన్న తప్పే. ముట్టుకున్న తప్పె, దూపైతె తాగనికి నీల్లు కూడా ఇచ్చెటోల్లు కాదు. పైసలిచ్చిన బండిల ఎక్కనిచెటోల్లు కాదు. అన్ని కస్టాలు బడికూడ గా మన్సి ఒక్క దినం సద్వు మాన్లె. ఏడ్సుకుంట ఇంట్ల కూసోలే. అన్నిట్కి ఓర్సుకుని పట్టుదలగా చదివి కామ్యబ్ అయ్యిండు.
గా సద్వులు గూడ గన్ని ఇయిన్న గావు, ఆ దినాల్ల వున్న సద్వులని గాయిన్నె సద్విండన్నట్లు. గవ్వెట్టి పేర్లు గూడ మనకు నోర్దిర్గవ్. సద్వులెక్కనె పెద్ద పెద్ద కొల్వులు గూడ చేసిండు.
ఇంగ్లీసోల్లు ఎల్పోయి మన దేశానికి సొతంత్రం ఒచ్చినంక ఉక్మతు తీరంత మార్చెసిండ్రు. గప్పుడు మనమంద్రం గెటెట్ల నడ్సుకోవాలే, ఏమేమ్ సరతలు అన్ని సూపిస్త ఒక పెద్ద పొస్తకం రాపించిండ్రు, గది రాజ్యంగం మన్నట్లు. పాపం ఓప్కెతోని అన్ని రాసి తయారు సేసిండ్రు. దాని పకారమె మనమంద్రం నడ్సుకుంటున్నం. గప్పుడు బెయిజ్జతు చేసిన పెద్ద కులపోల్లు యాడికిపోయిండ్రో? నీలెక్క రోసపడి కూసుంటే గియ్యన్ని అయ్యేటివా. బండి ఓడాయగద!
బండి ఒడాయగద!
- Advertisement -