Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబాక్సైట్‌ ప్రాజెక్టుకు బ్రేక్‌

బాక్సైట్‌ ప్రాజెక్టుకు బ్రేక్‌

- Advertisement -

– ఒడిశాలో నకిలీ గ్రామసభలతో వేదాంత ఆమోదముద్ర
– హైకోర్టు తలంటడంతో దిగొచ్చిన మోడీ సర్కార్‌
– అనుమతులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు వెల్లడి
భువనేశ్వర్‌ :
బ్రిటన్‌కు చెందిన మైనింగ్‌ కంపెనీ వేదాంత ఒడిశాలో తలపెట్టిన బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు బ్రేక్‌ పడింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ స్థానిక గిరిజనులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే తమ ప్రాజెక్టుకు ఆదివాసీల సమ్మతి ఉందని, గ్రామసభ సైతం ఆమోదం తెలిపిందని నకిలీ పత్రాలు సృష్టించి పాగా వేసేందుకు వేదాంత కుట్ర పన్నింది. దీనిపై బాధిత గిరిజనం హైకోర్టును ఆశ్రయించడంతో వేదాంత చర్యల పట్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దిగొచ్చిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒడిశాలో వేదాంత ప్రాజెక్టుకు తాత్కాలికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. బీజేపీకి పెద్ద మొత్తంలో ఎన్నికల విరాళాలు సమర్పించిన శతకోటీశ్వరుడు అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత కంపెనీ ఏడాదికి 90 లక్షల టన్నులు (9 ఎంటీపీఏ) ఉత్పత్తి లక్ష్యంతో ఒడిశాలోని కలహండి, రాయగడ జిల్లాల పరిధిలో 708.20 హెక్టార్ల అటవీ భూమిలో సిజిమాలి బాక్సైట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2025 ఏప్రిల్‌లో ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసింది. అయితే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..అటవీ భూములను వేరే అవసరాలకు మార్పు చేయాలంటే స్థానిక గిరిజనులు సమ్మతించాలి. గ్రామంలోని వయోజనులు అందరూ పాల్గొనే గ్రామ సభల్లో ఆమోదం చేయడం తప్పనిసరి. అయితే గ్రామసభలేవీ నిర్వహించకుండానే.. నిర్వహించినట్టు, ఆమోదం కూడా తెలిపినట్టు వేదాంత’ నకిలీ పత్రాలు సృష్టించింది. గిరిజనేతరులను ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాలకు తరలించి వారితోనే సభను నిర్వహించి.. ఇదిగో గ్రామసభ నిర్వహించాం. వీరు సమ్మతి కూడా చెప్పారు అంటూ పెద్ద కుట్రలకు తెర లేపారు. ఈ దుర్మార్గపు ఎత్తుగడులపై స్థానిక గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. ఆదివాసీల మొరను ఆలకించిన ధర్మాసనం స్థానిక ఆదివాసీల ఆమోదం తప్పనిసరి అంటూ, ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేముందు వీరి సమ్మతి కచ్చితంగా తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక గిరిజనం చెబుతున్నదేమిటి?
2023 డిసెంబరు 8న గ్రామసభ నిర్వహించినట్లు, అందులో తమ ప్రాజెక్టుకు ఆదివాసీలు ఆమోదం తెలిపినట్టు వేదాంత తప్పుడు పత్రాలు సృష్టించిందని, తమ సంతకాలను ఫోర్జరీ చేసిందని స్థానికులు విమర్శించారు. రాయగడ జిల్లాలోని కాశీపుర్‌ బ్లాక్‌లో ఉన్న పలాసగూడ నుంచి గిరిజనేతరులను ఇక్కడకు తీసుకొచ్చారని, వారితోనే గ్రామసభను నిర్వహించారని ఈ ప్రాంతానికి చెందిన ‘భూమి, ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి’ నాయకులు సుభా సింగ్‌ మాఝి విమర్శించారు. ఇదే రీతిలో రాయగడ, కలాహండి జిల్లాల్లో 10 గ్రామాల్లో బూటకపు గ్రామసభలు నిర్వహించినట్టు చెప్పారు. గ్రామసభల్లో స్థానిక గిరిజనులే పాల్గొన్నట్టుగా నమ్మించేందుకు వారి సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు మాఝి తెలిపారు. కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న యువత వేలిముద్రలు వేసినట్లు ఆయా పత్రాల్లో ఉన్నాయని, వేదంత వంచనకు ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని ఆయన పేర్కొన్నారు.
స్థానికుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందే
వేదాంత కుట్రలపై స్థానిక ఆదివాసీలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆదివాసీల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరిందం సిన్హా, జస్టిస్‌ ఎంఎస్‌ సాహూతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 5న ఆదేశాలు జారీ చేసింది. వేదాంత ప్రతిపాదించిన ప్రాజెక్టుకు అనుమతి విషయంలో స్థానిక గిరిజనుల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని, అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలించే ముందు వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో వేదాంత ప్రతిపాదిత ప్రాజెక్టుకు అటవీ అనుమతుల జారీకి బ్రేకులు వేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అటవీ సలహా మండలి (ఎఫ్‌ఏసీ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఇదే అంశంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ మాంఝి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆపేయాలని కోరుతూ ఎఫ్‌ఏసీకి ఈ ఏడాది జులై 30న ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎఫ్‌ఏసీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad