– ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి మారాలి: సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులపై ‘సుప్రీం’
న్యూఢిల్లీ : భావ ప్రకటనా స్వేచ్ఛ హద్దు మీరొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఏం చేసినా.. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి మారాలని పేర్కొంది. సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఏం చేసినా.. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కార్టూనిస్టు హేమంత్ మాలవీయ వేసిన పిటిషన్‌పై విచారణ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వనియోగం చేయొద్దని హెచ్చరిస్తూ.. కార్టూనిస్టు హేమంత్ మాలవీయకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అయితే ఇదే విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను షేర్ చేస్తే.. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.
ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో కార్టూనిస్టు హేమంత్ మాలవీయపై న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వినరు జోషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాలవీయ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను అప్‌లోడ్ చేయడం ద్వారా హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని జోషి ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ.. హేమంత్ మాలవీయ మధ్యప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ హద్దు మీరొద్దు
- Advertisement -
- Advertisement -