వాళ్ళు కుర్రాళ్ళు!
ఉరకలేసే కురంగాల్లా విరుచుకు పడే తరంగాల్లా
కొండల్ని పిండి కొట్టగల జెన్ జీ తరానికి ప్రతినిధులు!
వాళ్ళ నవ్వుల్లో గెలాక్సీలు గుజ్జనగూళ్ళాడుతూ
సద్దుమణిగిన గాలి తరగల్ని భళ్ళున బద్దలుగొట్టి
భరత నాట్యం చేయిస్తాయి!
వాళ్ళ నడకల్లో మెరుపుతీగలు మెలికలు తిరుగుతూ
బద్దకపు ఎద్దుల మొద్దునిద్రల్ని తన్ని తరిమేసే చెర్నకోళ్ళై
కాలం జూలుదులిపి కదం తొక్కస్తాయి!
వాళ్ళ మెదళ్ళ మైదానాల్లో పగళ్ళన్నీ సూర్య కిరణాల కవాతులే!
వాళ్ళ మదుల నదీతీరాల్లో రాత్రులన్నీ పూర్ణచంద్రుని శరత్తులే!
వాళ్ళు విభిన్న ఆలోచనలతో
విలక్షణ అభివ్యక్తులతో పదాలకు ప్రాణాలద్ది
వాక్యాలకు మెరుగులు దిద్ది బానిస భావాల ఛాందస రావాల్ని
పూర్వపక్షం చేసే వైతాళిక గీతాలై విశ్వమంతా విస్తరిస్తారు!
దేశమాతను అంగట్లో నిలబెట్టి తోలు వలచి వేలం వేస్తున్న
తాబేదార్ల గుట్టు విప్పి శ్రమజీవుల సుందర జగతికి
సువర్ణ కాంతుల ఛత్రాలై కాపు కాస్తారు!
మరి అలాంటి ఆ ఉడుకు నెత్తుటి పిడుగులన్నీ ఇవాళ
మాదకద్రవ్యాల కొండశిలువల ఉండచుట్టిన చాక్లెట్ రేపర్లలో
గుండపిండిగా మారిపోతున్నాయే…!
అలాంటి ఈ దేశ ప్రగతి కెత్తిన గొడుగులన్నీ ఇవాళ
మైకం రాజేసిన మంటల్లోపడి
మలమలా మండి మసైపోతున్నాయే…!
చీకటి సామ్రాజ్య నేతలు పనికట్టుకుని సరఫరా చేస్తోన్న
గంజాయి-నల్లమందు-కొకైన్
చెరస్ లాంటి మత్తు పదార్థాలు మెదళ్ళ కుదుళ్లలోకి దూరి
మెత్తని కత్తులతో దాడి చేస్తోంటే
అసాంఘిక కార్యకలాపాల్లో నెత్తుటి జలకాలాడుతున్నాయే!
కట్టడి చేయాల్సి పాలకవర్గాలు
భూ పందేరాల్లో బిజీగా తిరుగుతోంటే
ఇహ మన పిల్లల్నీ, వారి చేతుల్లోని ఈదేశపు ఎల్లల్నీ
ఈ రత్నగఠ్భంలో దాగిన ముల్లెల్నీ
రక్షించుకోవాల్సింది మనమే మనమే!!
– పతివాడ నాస్తిక్, 9441724167
మనమే!
- Advertisement -
- Advertisement -


