Friday, May 16, 2025
Homeమానవిమ‌రుగున ప‌డుతున్న క‌ళ‌కు జీవం పోస్తూ…

మ‌రుగున ప‌డుతున్న క‌ళ‌కు జీవం పోస్తూ…

- Advertisement -

సాదినేని శ్రీజ… తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథాగానంలో దిట్ట. ఒకేసారి అన్ని పాత్రల్లోనూ జీవించి రసవత్తరంగా నటించటంలో మేటి. నోటితో వాచికం చెబుతూ.. మృదు మధురమైన గానాన్ని ఆలపించటంలో ప్రత్యేకత. ముఖంలో సాత్వికం, కాలితో నృత్యం, చేతులతో ఆంగికం గుప్పిస్తూ ఆకర్షణీయమైన ఆహర్యంతో ఏకకాలంలో అభినయిస్తుంటారు. మూడుగంటలపాటు సాగే ఈ కార్యక్రమం ప్రేక్షకులకు విసుగు రాకుండా మధ్యలో పిట్టకథలతో హాస్యరసాన్ని పోషిస్తూ, సమాజంలోని కుళ్లును ఎత్తిచూపిస్తూ, పరిష్కారంగా మంచి మార్గాన్ని సూచిస్తూ జనరంజకంగా హరికథగానం చేయటంలో పెట్టిందిపేరు. బాల భాగవతారిణిగా హరికథాగానంతో రంగస్థలంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత బుల్లితెర, వెండితెరపై నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇలా మరుగున పడుతున్న కళకు జీవం పోస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసులు సాదినేని నాగేశ్వరరావు, భారతీదేవి దంపతుల కుమార్తె డాక్టర్‌ శ్రీజ సాదినేని. మాస్టర్‌ ఆఫ్‌ ఫెర్పార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎంపిఎ)లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. టాపర్‌గా నిలిచి యూనివర్శిటీలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 33 నాటకాలకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రికార్డులకెక్కారు. బాల్యంలోనే హరికథా గానం చేస్తున్న శ్రీజను వేదికపై చూసిన రంగస్థల నటులు, దర్శకులు కే.శాంతిబాబు తన ‘మేడిపండు’ నాటికలో బాలనటిగా నాటక రంగానికి పరిచయం చేశారు. అలా ఓవైపు చదువు, మరో వైపు నాటక రంగంలో మమేకమై హావభావాలు పలికించగల ప్రతిభాశాలిగా పేరుగాంచారు. డైలాగు డెలీవరీలో కొత్తదనం చూపేవారు. నటనలో వైవిధ్యం, ఆహార్యంలో నిండుదనం ఉండటంతో ఆనాటి ప్రముఖ కళాకారులు ఆమెను ప్రోత్సాహించి అవకాశాలు కల్పించేవారు. అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కళారంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి యాక్టింగ్‌, యాంకరింగ్‌, డబ్బింగ్‌, న్యూస్‌రీడింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, డైరెక్షన్‌ వంటి విభాగాల్లో 2500 మందికి శిక్షణ ఇచ్చారు. శ్రీజ కొటేషన్స్‌ (నిప్పులాంటి నిజాలు), త్రినయని, అభిసారిక పుస్తకాలను ఆమె ముద్రించారు.
నటనలో వైవిధ్యం..
సాంఘిక నాటకాలే కాక పద్య నాటకాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించారు శ్రీజ. సత్యభామ, మోహిని, లక్ష్మీదేవి, పార్వతి, రుక్మిణి, సుభద్ర, తార, వరూధిని, మధురవాణి, లకుమాదేవి, రుద్రమదేవి, రాణీ రాస్మణీదేవి, సమ్మక్క, చాకలి ఐలమ్మ, మదర్‌థెరిస్సా వంటి ఎన్నో పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా అనిపించుకున్నారు.
కథానాయికగా…
తెలుగు సినిమా పరిశ్రమలో ఎర్ర సముద్రం, కోయిల సినిమాల్లో కథానాయికగా నటించారు. ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఎర్ర సముద్రం. కోయిల సినిమాలో వేణుమాధవ్‌ కథానాయకుడిగానూ శ్రీజ కథానాయికగా నటించారు. ఇవే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పాండురంగడు, ఇక అంతా శుభమే పెళ్లి జరిపించండి, యు అండ్‌ ఐ, కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య, సోంబేరి, పాండవులు, ఇది కలకాదు, గరివిడి లక్ష్మి సినిమాల్లో నటించారు. అసోసియేట్‌ రైటర్‌గా 125, అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఐదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 400లకుపైగా, 20కిపైగా వెబ్‌సిరీస్‌లోనూ ఆమె గాత్రాన్ని అందించారు.
టెలివిజన్‌ రంగంలో…
బుల్లితెరపై కూడా వివిధ విభాగాల్లో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 108 టివి ప్రోగ్రామ్‌ హెడ్‌గానూ, అమెజే టివికి సిఇఒగా పనిచేశారు. పోగ్రామ్‌ డైరెక్టర్‌, రచయిత, యాంకర్‌, న్యూస్‌ప్రజెంటర్‌, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా పలు టీవీ సంస్థల్లో పనిచేశారు. ఆమె దర్శకత్వంలో 8 షార్ట్‌ ఫిలిమ్స్‌ను నిర్మించారు. రుతు రాగాలు, కస్తూరి, విధి, అలౌకిక, అన్వేషిత, చక్రవాకం, ఇల్లాలు ప్రియురాలు, తోడికోడళ్లు, మానస, సంగ్రామం, పితృదేవోభవ వంటి సీరియళ్లలో నటించి మెప్పించారు.
ఔత్సాహికులకు శిక్షణలు…
2003 నుంచి ఇప్పటి వరకూ సినీ ఔత్సాహికులకు యాక్టింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. దర్శకత్వం, ప్రొడక్షన్‌ రంగంలోకి కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు. 2008 నుంచి సినీ నటిగా కొనసాగుతున్నారు. టెలివిజన్‌ రంగంలో పోగ్రామ్‌ డైరెక్టర్‌, రైటర్‌, యాంకర్‌ న్యూస్‌ ప్రజెంటర్‌గా 2010 నుంచి 2017 వరకూ పనిచేశారు.
పొందిన అవార్డులు
సినీ కెరీర్‌లో ఆమె అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు. కాంతారావు పురస్కారం, వైకె గురుప్రసాద్‌ ఎక్సలెన్సీ అవార్డు, బీరమ్‌ నవీన లక్ష్మి పురస్కారాలను అందుకున్నారు. అలాగే నంది అవార్డుతో పాటు, రెండు సార్లు గరుడ అవార్డులు, హనుమా, అశ్వం, భీష్మ, వీణా అవార్డులు, అక్కినేని, తెలంగాణా దశాబ్ది, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రీభాయిపూలే, చంద్రన్న సేవా రత్న వంటి పురస్కారాలు అందుకున్నారు. అలాగే 33 తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించిన తెలుగు తొలి మహిళా దర్శకురాలిగా ఉమెన్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, రేడియంట్‌ టాలెంట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, మిరాకిల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వంటివి ఆమె ప్రతిభకు చిహ్నంగా నిలిచాయి. అతిత్వరలో వెండితెరపై దర్శకురాలిగా పరిచయం కాబోతున్న శ్రీజ సినిరంగంలో కూడా విజయాలను సాధించాలనీ, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.
– యడవల్లి శ్రీనివాసరావు

ఔత్సాహిక కళాకారుల కోసం
శ్రీ జయా ఆర్ట్‌ బ్యానర్‌ ద్వారా ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నాం. మూడు దశాబ్ధాల నట ప్రస్థానంగా నటిగా, రచయిత్రగా, దర్శకురాలిగా, లైటింగ్‌, మేకప్‌, సెట్‌ డిజైనింగ్‌ ఆర్టిస్ట్‌గా, ఈవెంట్‌ మేనేజర్‌గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్‌ నిర్వాహకురాలు, యాక్టింగ్‌ ప్యాకల్టీగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, షార్ట్‌ ఫిల్మ్‌ దర్శక, నిర్మాత, యూట్యూబర్‌గా అనేక రంగాల్లో నా వంతుగా కళామతల్లి సేవలో పునీతమవుతున్నా.
– డాక్టర్‌ శ్రీజ సాదినేని, సినీనటి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -