న్యూఢిల్లీ : ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు తిరిగి మళ్లీ ఎగిసిపడుతు న్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ టారిఫ్‌లపై దృష్టి పెడుతున్నారనే సంకేతాలకు తోడు యుఎస్ ఫెడ్ రిజర్వు మీటింగ్ నేపథ్యంలో మంగళవారం పసిడి ధర వరుసగా మూడో రోజూ పెరిగింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.2400 పెరిగి రూ.99,750గా పలికిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారంపై రూ.2400 పెరిగి రూ.99,300గా నమోదయ్యింది. కిలో వెండి రూ.1800 ప్రియమై రూ.98,500గా నమోదయ్యింది. అంతర్జాతీయంగా ఒక్క ఔన్స్ పసిడి 1.37 శాతం లేదా 45.65 డాలర్లు పెరిగి 3,379.77 డాలర్లుగా పలికింది.