Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుమాకినేని గొప్ప సిద్ధాంతకర్త

మాకినేని గొప్ప సిద్ధాంతకర్త

– ప్రజా ఉద్యమాల నిర్మాణమే ఆయనకు నిజమైన నివాళి
– మతోన్మాదం, సరళీకృత విధానాలపై పోరాడాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య
– హైదరాబాద్‌లో మాకినేని బసవపున్నయ్య వర్ధంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎం) నేత మాకినేని బసవపున్నయ్య (ఎంబీ) గొప్ప సిద్ధాంత కర్త అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ వీరయ్య అన్నారు. గత చరిత్ర చెప్తే ఉపయోగం లేదనీ, ప్రస్తుతం చేపట్టే ప్రజా ఉద్యమాలు, భవిష్యత్తులో విప్లవాన్ని నిర్మించడమే కర్తవ్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎంబీ 33వ వర్ధంతి కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో నిర్వహించారు. మాకినేని బసవపున్నయ్య చిత్రపటానికి వీరయ్య సహా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర గల వారసులుగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలంటూ ఎంబీ సూచించారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకం కావాలనీ, ఎలాంటి త్యాగాలకైనా, పోరాటాలకైనా సిద్ధం కావాలన్నారని చెప్పారు. గతంలో ఏం చేశామనేది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేస్తామనేది కీలకమని అన్నారు. పార్టీ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజాపోరాటాలేనని చెప్పారు. ప్రజా ఉద్యమ నిర్మాతల్లో పుచ్చలపల్లి సుందరయ్య, ఏకే గోపాలన్‌ అగ్రగణ్యులని అన్నారు. ఎంబీ గొప్ప సిద్ధాంతకర్త అని వివరించారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వచ్చిన ఒడిదుడుకులను లోతుగా అధ్యయనం చేసి ఆయన సిద్ధాంతీకరించిన గ్రంథాన్ని ఈతరం చదవాల్సిన అవసరముంద న్నారు. అంతరంగిక పోరాటాల గురించి వివరంగా ఉందని చెప్పారు. సంస్కరణవాదం పార్టీని ఆవహించిందని అన్నారు. పార్లమెంటరీతత్వం పెరిగిపోయిందన్నారు. వీటినుంచి ఎలా బయటపడాలనే దానిపై సైద్ధాంతిక మథనం సాగుతున్నదని వివరించారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక కమ్యూనిస్టు ఉద్యమం వెనుకబాటు పట్టిందని అన్నారు. లాటిన్‌ అమెరికాలో ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయని వివరించారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తున్నాయని చెప్పారు. సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను మతోన్మాదం అడ్డుకుంటున్నదని అన్నారు. శ్రామికులను మతం పేరుతో విభజిస్తున్నదని వివరించారు.
ఇప్పుడు మతోన్మాదాన్ని ఓడించడమా?, సరళీకృత ఆర్థిక విధానాలపై పోరాటం చేయడమా?అనే సైద్ధాంతిక సమస్య వచ్చిందన్నారు. ఈ అంశాలపైనే విశాఖపట్నంలో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభల నుంచి చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో కుల సమస్య ఉందన్నారు. కుల సమస్యను విస్మరించి విప్లవం గురించి మాట్లాడే పరిస్థితి లేదని చెప్పారు. కులంవైపు కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు వర్గపోరాటమే ప్రధానమనీ, అది పరిష్కారమైతే మిగతా సమస్యలన్నీ పరిష్కారమవు తాయన్న అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉందన్నారు. అతివాదం, మితవాదం నుంచి బయటపడి విప్లవపార్టీగా ఎలా అవతరించిందో, ఇప్పుడు కూడా కుల సమస్య, వర్గ పోరాటం రెండింటినీ విడగొట్టి సరైన మార్క్సిస్టు దృక్పథంతో పనిచేయాలని సూచించారు. దానికోసం పార్టీ సర్వశక్తులు ఒడ్డి పనిచేయాల్సిన అవసరముందన్నారు. సరైన సైద్ధాంతిక దిశ రూపొందే అవకాశముందని చెప్పారు. ఈ విషయాలపై నిజమైన కమ్యూనిస్టుగా ఆలోచించాలని సూచించారు. ఎంబీ బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, టి సాగర్‌, బండారు రవికుమార్‌, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు, పి ఆశయ్య, జె బాబురావు, బి ప్రసాద్‌, ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img