Tuesday, April 29, 2025
Navatelangana
Homeనేటి వ్యాసంముందుదారి చూపిన మహాసభ

ముందుదారి చూపిన మహాసభ

- Advertisement -

మదురైలో జరిగిన సీపీఐ(ఎం) 24వ మహాసభ గొప్ప ప్రజాప్రదర్శనతో ముగిసింది. అనేక కారణాల వల్ల దీనికి ప్రత్యేకత ఏర్పడుతున్నది. ఎజెండాలోను, చర్చల సారాంశంలోను కూడా మార్పులు ఉన్నాయి. మొట్టమొదటిది-రాజకీయ తీర్మానం ముసాయిదాతో పాటు 23వ మహా సభలో ఆమోదించుకున్న రాజకీయ ఎత్తుగడల పంథా అమలుపై సమీక్షకు సంబంధించి ఒక రాజకీయ సమీక్ష నివేదికను కూడా మహాసభ ప్రతినిధుల చర్చ కోసం సమర్పించబడింది. మామూలుగా రాజకీయ సమీక్ష రాజకీయ నిర్మాణ నివేదికలో భాగంగా ఉండేది. రాజకీయ తీర్మానం ఆమోదించాక దాన్ని చర్చించటం జరుగుతుండేది.
లోతైన పరిశీలన
రాజకీయ ఎత్తుగడల పంథా ఏ విధంగా అమలు జరిగిందో దాంట్లో అనుభవాలు, బలహీన మైన, బలమైన అంశాలేమిటో రాజకీయ సమీక్ష నివేదిక కొంత లోతుగా వెళ్లి పరిశీలించింది. పార్టీ స్వతంత్ర బలం పెరుగుదలకు ఆటంకంగా నిలిచిన అంశాలు ఏమిటో పార్టీ శాఖలు, శ్రేణులు అర్థం చేసుకోవడానికి ఇది వీలు కలిగించింది. 23వ మహాసభ తర్వాత 33,252 (3.37 శాతం) పార్టీ సభ్యత్వం పెరిగింది. మొత్తం అన్ని ప్రజాసంఘాల సభ్యత్వం పెరిగింది. అయినప్పటికీ పార్టీ స్వతంత్ర శక్తిలో కాని, రాజకీయ పలుకుబడిలో కాని చెప్పుకోదగిన మెరుగుదల లేదు.అందువల్లనే రాజకీయ తీర్మానం ముసాయిదా, నిర్మాణ నివేదిక ముసాయిదా రెండింటిపై జరిగిన చర్చల సందర్భం గా పూసల్లో దారం లాగా ఒకే అంశం నడిచింది. పార్టీ బలాన్ని, ప్రజా పునాదిని పెంపొందించడానికి చేయాల్సింది ఏమిటనే అంశం మీద చర్చ సాగింది.
స్వతంత్ర శక్తి పెంపు
రాజకీయ తీర్మానం ముందుంచిన ప్రధాన కర్తవ్యం బీజేపీ, ఆరెస్సెస్‌లను ఒంటరిని చేసి ఓడించటం. ఇది సీపీఐ(ఎం), వామపక్షాల సొంత బలం పెరగడం అన్న అంశాన్ని తప్పనిసరి ఆవశ్యకతగా చేస్తున్నది. బీజేపీపై పోరాడేందుకు ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్య తత్వాలను రక్షించడానికిగాను అన్ని ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల విశాల ఐక్యతను పెంపొందిం చేందుకు సీపీఐ(ఎం) కృషి చేస్తుంది. అందుకు సహకరిస్తుంది. అదే సమయంలో పార్టీ బలాన్ని విస్తరించుకోవడం కోసం రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణ కృషికి ప్రాధాన్యత ఇస్తుంది.ఇందుకు సంబంధించి హిందుత్వ భావజాలంపైన బీజేపీ, ఆరెస్సెస్‌ల మతతత్వ రాజకీయాలపైన నిరంతరాయ పోరాటం ఎలా సాగించాలన్న విషయమై మహాసభలో రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలు సరైన దిశా నిర్దేశం చేశాయి. పార్టీ అన్ని స్థాయిలలోనూ రాజకీయ సాంస్కృతిక సామాజిక రంగాలలో సైద్ధాంతిక కృషిని ముమ్మరం చేస్తుంది. హిందుత్వ కార్పొరేట్‌ పాలనా వ్యవస్థ నయా ఫాసిస్టు లక్షణాలను ప్రదర్శిస్తున్న కారణంగా ఈ పోరాటం తక్షణావసరం అవుతున్నది.
ప్రజా పోరాటాలు, వర్గ పోరాటాలు
రాజకీయ ఎత్తుగడల పంథా ఇచ్చిన మరొక నిర్దేశం వర్గ ప్రజా పోరాటాలను ఉధృతం చేయటం. స్థానిక పోరాటాలను నిరంతర ప్రాతిపదికన కొనసాగించాలని అది నొక్కిచెప్పింది. ఈ స్థానిక పోరాటాలే ప్రజా బాహుళ్యాన్ని పార్టీకి దగ్గర చేస్తాయి. రాజకీయంగా సంఘటితం కావడం దాని పలుకుబడి పెరగటం వీలవుతుంది. భూస్వాములు, సంపన్న పెట్టుబడిదారీ రైతులు, కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులతో కూడిన గ్రామీణ సంపన్న కూటమికి వ్యతిరేకంగా గ్రామీణ పేదల పోరాటాలు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వర్గ పోరాటాలుగా ఉంటాయి. నిర్మాణంపై నివేదిక పార్టీ సొంత బలాన్ని, ప్రజాపునాదిని పెంచుకోవటం అనే ప్రధాన ఇతివృత్తాన్ని చర్చించింది. ఇందుకు సంబంధించిన కీలక అంశాలు-పార్టీ సభ్యత్వం నాణ్యతను మెరుగు పరచడానికి తీసుకున్న చర్యలు, ప్రాథమిక విభాగంగా ఉన్న శాఖలను క్రియాశీలం చేయడం. ఈ కర్తవ్యాల్లో కొంత పురోగమనం సాధించినప్పటికీ ఇంకా చాలా చేయవలసింది మిగిలి ఉంది. సభ్యత్వ నాణ్యత పెంచడానికి సంబంధించిన ముఖ్యమైన అంశం మహిళలను, యువతను పార్టీలోకి మరింతగా చేర్చుకోవటం. మొత్తం సభ్యత్వంలో మహిళలు 20.2 శాతం ఉన్నారు. నిర్మాణంపై కోల్‌కతా ప్లీనమ్‌ నిర్దేశించిన 25శాతం మహిళల సభ్యత్వం లక్ష్యాన్ని చేరుకోవట తదుపరి అడుగు.
యువతపై కేంద్రీకరణ
పార్టీ భవిష్యత్తు పెరుగుదలకు సంబంధించిన ఒక కీలకమైన అంశం యువతను పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఆకర్షించటం. కేరళ రాష్ట్ర శాఖ మొత్తం సభ్యత్వంలో 29 శాతం 31 ఏళ్లు, అంతలోపు యువ తను కలిగి ఉండడం ద్వారా ప్రశంసనీయమైన కృషి చేసింది. యువత కేంద్రిత రాజకీయ వేదికలు ఏర్పాటు చేయాలని, వారిలో సోషలిజం నిజమైన ప్రత్యామ్నాయం అనే ప్రచారాన్ని పెంచాలని రాజ కీయ తీర్మానం, నిర్మాణ నివేదిక రెండూ చెప్పాయి.
కొత్త నాయకత్వం
మహాసభ 85మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకోగా అందులో 30 మంది కొత్తవారే ఉన్నారు. 17 మంది మహిళలను చేర్చుకోవడం ద్వారా కమిటీలో 20 శాతం మహిళలు ఉండాలన్న కోటా కూడా పూర్తయింది 18 మంది సభ్యులతో పొలిట్‌ బ్యూరోను, ఎం.ఏ బేబీని నూతన కార్యదర్శిగా కొత్త కేంద్ర కమిటీ ఎన్నుకున్నది. మహాసభ నిర్దేశించిన రాజకీయ, నిర్మాణ కర్తవ్యాలను ముందుకు తీసుకు పోవడంలో ఈ నూతన నాయకత్వం, బృందంపై విశ్వాసం వుంచవచ్చు. తమిళనాడు రాష్ట్ర కమిటీ 24వ మహాసభకు సమర్థంగా ఆతిథ్యమిచ్చి నిర్వహిం చింది. మహాసభ కోసం సాగిన సన్నాహాల్లో అన్ని స్థాయిల్లోని పార్టీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. భవిష్యత్తు దిశగా ముందుకు సాగడానికి మార్గం ఏర్పడిందనే గట్టి ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని మహాసభ ప్రతినిధుల్లో పాదుకొల్పింది.
(ఏప్రిల్‌ 9 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు