వేసవిలో త్వరగా అలసిపోతుంటాం. చిన్న పని చేసినా నీరసం వచ్చేస్తుంటుంది. అలాంటి సమయంలో శరీరానికి శక్తిని, చలువనిచ్చే ఆహారం తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతాం. రాగులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి తాపాన్ని తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలోని పోషక విలువలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలోని కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు ఎముకలను బలంగా చేయడంతో పాటు షుగర్, అధిక బరువును అదుపులో ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న రాగులతో వెరైటీ వంటలు చేసుకొంటే ఈ వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి అలాంటి వంటల గురించి ఈ రోజు తెలుసుకుందాం…
రాగి అంబలి
కావల్సిన పదార్థాలు : రాగి పిండి – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు తరుగు – కొద్దిగా, ఉల్లిగడ్డ తరుగు – పిడికెడు, అల్లం తరుగు – కొద్దిగా, పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా గిన్నెలో రాగి పిండిని తీసుకొని నాలుగు కప్పుల వరకు నీరు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద ఆ బౌల్‌ని ఉంచి పాత్రను రాగి పిండి వదిలేసే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
వాస్తవానికి రాగిపిండి మూడు నాలుగు పొంగులు రాగానే చిక్కగా మారుతుంది. అంతమాత్రాన రాగిపిండి చక్కగా ఉడికినట్టు కాదు. ఇలా తాగడం వల్లనే కడుపులో మంట, పుల్లటి తేన్పులు రావడం, అరగనట్టు అనిపించడం జరుగుతుందట.
కాబట్టి నిదానంగా మధ్యమధ్యలో కలుపుతూ రాగి పిండి పాత్రను వదిలేసే వరకు చక్కగా ఉడికించుకోవాలని గుర్తుంచుకోవాలి. అందుకోసం 15 నుంచి 18 నిమిషాల సమయం పట్టొచ్చు. రాగిపిండి చక్కగా ఉడికి, కలిపితే గరిటెకు అంటుకోకుండా జారిపోతుందో అప్పుడు గిన్నెను దింపి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మట్టిపాత్రలో ముప్పావు భాగం వరకు(ఒకటిం పావు లీటర్) నీరు తీసుకోవాలి. చల్లారిన రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, మట్టిపాత్రలో తీసుకున్న నీటిలో వేసుకోవాలి. మూతపెట్టి రాత్రంతా ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల శరీరానికి, పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. తర్వాత రోజు నానబెట్టుకున్న ఆ ముద్దలను చేతితో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వీలైతే జాలీ గంటెతో వడకట్టుకొని మరో గిన్నెలోకి పోసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తరకలు లేకుండా విస్కర్ సహాయంతో బాగా చిలుక్కోవాలి. దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావలో వేసుకొని కలుపుకోవాలి. అందులో ఉప్పు వేసుకొని రెండు మూడుసార్లు బాగా చిలుక్కోవాలి. తర్వాత సన్నని కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి. అలాగే చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ తరుగుని చేతితో నలిపి వేసుకోవాలి. ఇక చివర్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే ‘రాగి అంబలి’ సిద్దం.
రాగి ఉప్మా
కావాల్సిన పదార్ధాలు: రాగి పిండి – కప్పు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, శనగపప్పు – టీ స్పూను, మినపప్పు – టీ స్పూను, పల్లీలు – టేబుల్ స్పూను, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం – కొద్దిగా తరిగిన, ఉల్లిగడ్డ తరుగు – కొద్దిగా, పచ్చిమిర్చి – ఆరు, పసుపు – పావు టీ స్పూను, ఉప్పు – టీ స్పూను, తురిమిన పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – టీ స్పూను.
తయారీ విధానం: గిన్నెలో రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మరీ చపాతీ పిండిలా కాకుండా కలిపి పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఓ స్టీమ్ ప్లేట్‌ను నూనెతో రాసి రాగి పిండి మిశ్రమాన్ని సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి స్టీమర్‌లో (ఇడ్లీ పాత్ర లాంటిది) నీళ్లు పోసుకుని స్టీమ్ ప్లేట్‌ను అందులో పెట్టి పది నిముషాలు రాగి పిండిని ఆవిరిపైనా ఉడికించుకోవాలి. తర్వాత స్టీమర్ దించేసి రాగిపిండి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయిని స్టౌపై పెట్టి నూనె పోసి వేడి చేసుకుని శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. పప్పులు కాస్త రంగు మారిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువా, కరివేపాకు, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత తురిమిన పచ్చికొబ్బరి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రాగి పిండి మిశ్రమం వేసి రెండు నిమిషాలు కలిపి దించేసుకుంటే రాగి ఉప్మా రెడీ!
చపాతీ
కావల్సిన పదార్థాలు: రాగి పిండి – కప్పు, నీరు – కప్పు, ఉప్పు – టీ స్పూను, నూనె లేదా నెయ్యి – తగినంత.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి రాగి పిండిని జల్లించి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. పిండి ఎన్ని కప్పులు తీసుకుంటే నీరు కూడా అన్ని కప్పులు తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు రాగి పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి తడి చేసుకుంటూ సాఫ్ట్‌గా ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఎంత సాగదీసి కలిపితే చపాతీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. పిండిని మెత్తగా కలుపుకున్న టీ స్పూను నూనె వేసి మరో ఐదు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీకి సరిపడే సైజ్‌లో ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకొని పొడి రాగి పిండిలో అద్ది, చపాతీ కర్రతో గుండ్రంగా లేదా మీకు నచ్చిన ఆకారంలో పలుచగా చేసుకోవాలి. చపాతీలు రోల్ చేసేటప్పుడు అవసరమైతే పొడి పిండిని వాడుకోవచ్చు.
స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కాక రోల్ చేసిన చపాతీని వేసి హై ఫ్లేమ్‌లో ఉంచి లైట్‌గా నూనె వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చండి. అప్పుడు చపాతీ బాగా పొంగుతుంaది. అంతే టేస్టీ రాగి చపాతీలు రెడీ.
చిట్కాలు: 7 రాగి పిండి కొంచెం జిగురు తక్కువగా ఉంటుంది కాబట్టి, చపాతీలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. 7 పిండిని బాగా నాననివ్వడం వలన చపాతీలు మృదువుగా వస్తాయి. 7 పిండి కలిపేటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని కూడా కలుపుకున్నా సరిపోతుంది. 7 చపాతీలను నూనె లేకుండా కాల్చుకున్నా పూరీల మాదిరి పొంగుతాయి.
బన్ దోశ
కావాల్సిన పదార్థాలు: రాగి పిండి – కప్పు, బొంబాయి రవ్వ – ఐదు టీ స్పూన్లు, పెరుగు – పావు కప్పు, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి- రెండు, జీలకర్ర – టీ స్పూను, క్యారెట్ తురుము – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు- రుచికి సరిపడా, వంట సోడా – అర టీ స్పూను.
తయారీ విధానం: గిన్నెలోకి రాగి పిండి తీసుకోవాలి. అందులోకి పెరుగు, ఉప్మా రవ్వ వేసి కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, క్యారెట్ తురుము, ఉప్పు, వంటసోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. అలా అని పిండి మరీ లూజుగా ఉండాల్సిన పనిలేదు. అడుగు లోతుగా ఉండే చిన్న కడాయి లేదా గిన్నెను పెట్టుకోవాలి. అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత రాగి పిండిని రెండు గరిటెలు వేసుకొని మందపాటి దోశ మాదిరి వేసుకోవాలి. మంటను సిమ్‌లో పెట్టి పైన మూత పెట్టి ఓ వైపు ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత మరోవైపు తిప్పి మగ్గించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని చట్నీతో తింటే సూపర్ ఉంటాయి.
టిప్స్: 7 ఉప్మా రవ్వకు బదులు అటుకుల పొడి కలపడం వల్ల కూడా దోశలు మెత్తగా, గుల్లగా వస్తాయి. 7 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల దోశలకు మంచి రుచి వస్తుంది. 7 పాన్ బాగా వేడిగా ఉంటే దోశలు క్రిస్పీగా వస్తాయి.
రాగులతో పసందుగా..
- Advertisement -