– బనకచర్లకు సహకరించాలన్న
– కేంద్రం లేఖ పట్ల సీపీఐ(ఎం) ఖండన
– బీజేపీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలి
– బీసీ బిల్లు అమలు పోరాటానికి మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– అమెరికా సుంకాలపై మోడీ మెతకవైఖరి
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
– మిర్యాలగూడలో డబ్బికార్ సుమిత్రబాయి సంతాప సభ
నవతెలంగాణ- మిర్యాలగూడ
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి రాజకీయంగా బీజేపీ ప్రభుత్వం లబ్ది పొందాలని చూస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బృందావన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్ సతీమణి సుమిత్రబాయి సంతాప సభలో ఆమె చిత్రపటానికి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, ఎండి అబ్బాస్, సీనియర్ నాయకులు డిజి.నర్సింహారావు తదితరులు పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఖండించారు. ఓ వైపు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి, మరోవైపు బనకచర్ల నిర్మించడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, బిల్లు, జీవో రద్దుకు ప్రయత్నించిందని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడుతూనే కేంద్రంలో వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలు కాకుండా కేంద్రం అడ్డుపడుతోందని, దానికి నైతిక బాధ్యత వహించి రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, దీనికోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసే న్యాయ పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని తెలిపారు. బీసీ బిల్లును అడ్డుకుంటున్న బీజేపీకి భవిష్యత్‌లో పుట్టగతులు ఉండవని, క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులను ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో మహిళా కూలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో నకిలీ రైతులు భూమి లేకున్నా.. ధాన్యం అమ్ముకపోయినా ప్రభుత్వ సొమ్ము రూ.1.86 కోట్లు కాజేశారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బీసీ రిజర్వేషన్స్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి :తమ్మినేని వీరభద్రం
42 శాతం బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసేందుకు ప్రయత్నం చేసిందని, కానీ కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతుందని, అది సరిపోదని, అన్ని పార్టీలనూ కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలా చేస్తేనే 42 శాతం బీసీ రిజర్వేషన్స్ అమలవుతాయన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ భారతదేశంపై అధిక సుంకాలు విధిస్తున్నారని, దీనిపై ప్రధాని మోడీ మెతకవైఖరి వహించడం సరికాదని అన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబిన్, పత్తి, మాంసం, పాలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అలా చేస్తే దేశంలో వ్యవసాయం కుంటుపడుతుందని చెప్పారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు చేపడ్తామన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ధాన్యం కోతలు సాగుతున్నాయని, అవసరమైన చోట ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు మద్దతు ధర అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ వన్‌టౌన్, టూ టౌన్ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్ల పాండు, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, పరుశరాములు, వరలక్ష్మీ పాల్గొన్నారు.
రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్రం కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES