– మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీజీఐజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు
– ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మహాధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీజీఐజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయలేని విధంగా కేంద్రం ఆదేశాలిస్తోందని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనకుండా చేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌లను ప్రకటించి ఏరియర్స్ ఒకే దఫా చెల్లించాలన్నారు. ప్రతి జిల్లాలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్లను, తగిన సిబ్బందిని నియమించి అన్ని రకాల అవుట్ పేషెంట్స్ జబ్బులను గుర్తించి ఉచిత టెస్టులు చేయాలని కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్లు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 డిపార్ట్‌మెంట్ల సమస్యల పరిష్కారానికి, డిపార్ట్‌మెంట్ వారీగా డిమాండ్లకు సమాధానం ఇవ్వాలంటే.. ఇప్పటికి 9 డిపార్ట్‌మెంట్లు నోట్ పంపించాయన్నారు. సీఐటీయూ నాయకులు వీఎస్.రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికుల సంక్షేమం కోసం పని చేయడం లేదని, కేవలం కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నాయని విమర్శించారు. ఈ విధానంలో మార్పు రాకపోతే రాష్ట్రంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. సీనియర్ నాయకులు ఎంఎన్.రెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించాలన్నారు. పూర్వ ఎన్జీఓ నాయకులు అంజనేయులు మాట్లాడుతూ.. పాలకులు ఉద్యోగ సంఘాలను చీల్చి లోపాయికారి విధానాలు అవలంబించడం సరికాదన్నారు.
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పోతుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 2024 మార్చి తర్వాత రిటైరైన వారికి సంవత్సర కాలం గడుస్తున్నా పెన్షనర్ బెనిఫిట్లు చెల్లించలేదన్నారు. ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పెన్షనర్లకు రావాల్సిన ఐదు డీఆర్‌లు మంజూరు చేయాలనీ, వేతన సవరణ కమిషన్ రిపోర్టు తెప్పించుకుని అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలనీ కోరారు. ఉపాధ్యక్షులు ఎం.నరహరి మాట్లాడుతూ.. తెలంగాణ మొదటి వేతన సవరణ కమిషన్ సూచనల ప్రకారం 20 సంవత్సరాల సర్వీసుకు పూర్తి పెన్షన్ చెల్లించే ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు డా.ఎల్.అరుణ మాట్లాడుతూ.. ఈహెచ్‌ఎస్ స్కీంతో అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ నాయకులు కమల కుమారి మాట్లాడుతూ.. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు జరగడం లేదని, మూడు నెలల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డిప్యుటీ జనరల్ సెక్రటరీ సీతారాం మాట్లాడుతూ.. ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ధర్నాలో రాష్ట్ర నాయకులు ప్రభాకర్ నాయర్, మచ్చా రంగయ్య, కె.నాగేశ్వర్‌రావు, స్వరాజ్ కుమార్, బ్రహ్మయ్య, లక్ష్మి నారాయణ, జనార్ధన్, నర్సింగరావు, రామారావు, రమేశ్, రాధాకష్ణ, క్రిష్ణ మోహన్, శ్యాంసుందర్, మీడియా ఇన్‌చార్జి జి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
- Advertisement -
RELATED ARTICLES