– మంత్రులు, ఎమ్మెల్యేలు మాట వినే పరిస్థితిలో లేరు
– బీజేపీని 2028 ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోరు
– తెలంగాణ ప్రజల గుండెచప్పుడు బీఆర్‌ఎస్
– వరంగల్‌లో కనీవిని ఎరుగని రీతిలో రజతోత్సవ వేడుకలు
– కేసీఆర్ సందేశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలన చేత కావడం లేదు. సీఎం సర్కార్‌ను నడుపుతున్నారో… సర్కస్ కంపెనీ నడుపుతున్నారో అర్థం కావడం లేదు. అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తున్నారు. బీజేపీని 2028 ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తోనే మాకు పోటీ. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక బీఆర్‌ఎస్. 25ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసాం. ఓటమి నుంచి గెలుపు తీరాలను ఎలా చేరాలో మాకు తెలుసు. రేపు వరంగల్‌లో జరిగే పార్టీ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఇచ్చే సందేశం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం మాట వినే పరిస్థితిలో లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేయలేక బీఆర్‌ఎస్‌పై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారని ఆరోపించారు.”రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ముందు తెలియదా? కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌గా శ్రీధర్‌బాబు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా భట్టి, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌కు అన్ని విషయాలు తెలుసు. అయినా అడ్డగోలు హామీలిచ్చారు. వాటిని అమలు చేయలేక బీఆర్‌ఎస్‌పై నెపం నెట్టేసేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. పదేండ్లలో మేం సగటున ఏడాదికి రూ.41 వేల అప్పు చేస్తే, కాంగ్రెస్ ఏడాదిలో రూ.1,60,000 కోట్లు చేసింది” అని రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని విమర్శించారు. అయన తన భాషను, పద్ధతిని మార్చు కోవాలని హితవు పలికారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలా వద్దా అనేది పార్టీ ఇష్టమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను విమర్శించడం మాని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి వారు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మేడి గడ్డ బ్యారేజీపై డిసెంబర్ 2024లో ఎన్‌డీఎస్‌ఏ సిద్దం చేసిన రిపోర్టును ఇప్పుడెందుకు బహిర్గతం చేశారని ప్రశ్నించారు. ఇది ఎన్‌డీఎస్ రిపోర్ట్ కాదనీ, ఎన్‌డీఏ రిపోర్టని ఎద్దేవా చేశారు.
బీజేపీకి మూడో స్థానమే…
రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని కేటీఆర్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ పేరు చెప్పి బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుందని వ్యాఖ్యానించారు. ఎంపీ ఎన్నికల్లో దేశభక్తి అంటూ ప్రజలను పక్కదారి పట్టించి గెలిచిందని విమర్శించారు. రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తోనే పోటీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల నుంచి 2023 ఎన్నికల వరకు ఫలితాలను చూస్తే దేశ వ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతుందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్లు దేశంలో ఎక్కడ సక్సెస్ అయినాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ సందేశం కోసం తెలంగాణ ఎదురు చూస్తోంది..
తెలంగాణ సమాజం వరంగల్ సభలో కేసీఆర్ సందేశం కోసం ఎదురు చూస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.24 ఏండ్ల పాటు ఒక పార్టీ విజయవంతంగా నిలదొక్కుకుని ప్రజల్లో ఉండడమనేది అరుదైన విషయమని అన్నారు. బీఆర్‌ఎస్ తర్వాత ఒక్క జేఎంఎం పార్టీకే ఆ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కూడా సమర్థ పాత్ర పోషిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నారని తెలిపారు. ఢిల్లీ పార్టీలను నమ్మి మోసపోవద్దనీ, తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రేవంత్‌కు పాలన చేతకాదు
- Advertisement -
RELATED ARTICLES