– అనుకున్నదొకటి…అయ్యింది మరొకటి అంచనాలకు మించి వచ్చిన 16.23 లక్షల దరఖాస్తులు
– ఆర్థిక సర్దుబాటే అసలు సమస్య
– లబ్దిదారుల ఎదురు చూపులు
– ముంచుకొస్తున్న స్థానిక సమరం
రాజీవ్ యువవికాసంపై ప్రతిష్టంభన ఏర్పడింది. నిరుద్యోగులు, యువతరం నుంచి దరఖాస్తులు ఆహ్వానించాక, అంచనాలు తలకిందులు కావడం, నిధుల లేమి వెంటాడటంతో ఏం చేయాలో తోచక ప్రభుత్వం ‘పున్ణపరిశీలన’ అంటూ తాత్కాలికంగా పథకాన్ని పక్కనపెట్టింది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వంలోనూ పెద్దగా చర్చలు జరుగుతున్న దాఖలాలూ లేవు. మరోవైపు స్థానిక సమరం గడువు దగ్గరపడుతుండటంతో అధికారపార్టీ హైరానా పడుతుంది. ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతరానికి ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికల్లో పడుతుందేమో అనే అనుమానాల్ని అధికారపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఎస్. వెంకన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ ఇంకా బాలారిష్టాలు దాటట్లేదు. ఈ పథకాన్ని ప్రకటించేటప్పుడు ప్రభుత్వ అంచనాలు ఒకరకంగా ఉంటే, దరఖాస్తుల ఆహ్వానం తర్వాత అవన్నీ తారుమారయ్యా యి. ఇప్పట్లో ఈ పథకం అమల్లోకి వస్తుందా లేదా అనే సందేహాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తొలి విడత కింద రూ.లక్ష లోపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ అది కార్యరూపంలోకి రాలేదు. దరఖాస్తుదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే అనుమానం తో పున్ణపరిశీలన పేరుతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
దరఖాస్తుల వెల్లువ..
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ అంచానాల ప్రకారం బీసీలకు 1.55 లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వారి నుంచి ఏకంగా 8.01 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీలకు 1.44 లక్షల యూనిట్లు లక్ష్యం కాగా, 3.92 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీలకు 91 వేల యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా, వారి నుంచి 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇబీసీలకు 51 వేల యూనిట్ల లక్ష్యం కాగా, 37 వేల దరఖాస్తులే వచ్చాయి. క్రైస్తవులకు 5 వేల యూనిట్లు ఉంటే 4,604 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రవ్యా ప్తంగా 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 16 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
అంచనాలు తలకిందులు
మొదటి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు జూన్ 2 నుంచి 9 వరకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. కేటగిరీ-1లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు యూనిట్ల కోసం దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాదాపు 2.8 లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూరు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ 1,32,634 మందే దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో రూ.50 వేల లోపు యూనిట్లకు పూర్తి రాయితీ ప్రకటించినా, 39,401 దరఖాస్తులే వచ్చాయి. రూ.లక్షలోపు యూనిట్లకు 90 శాతం రాయితీ ప్రకటిస్తే, 93,233 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 79 శాతం మంది రూ.3 నుంచి 4 లక్షలు వ్యయమయ్యే యూనిట్లకు దరఖాస్తులు చేసుకున్నారు. వారిని లక్ష లోపు యూనిట్లకు మార్చుకోవాలని అధికారులు సూచించినా ఫలితం లేకపోయింది. మరోవైపు రూ.50 వేల లోపు యూనిట్ల ఏర్పాటు కూడా సమస్యగా మారుతున్నదని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వ్యాపారాల్లో ఉన్న యువకులు తమ వ్యాపార విస్తరణకు నిబంధనలు వర్తించలేదు. దీనితో అలాంటివారి దరఖాస్తులను తిరస్కరించారు. తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం ఇక్కడ బెడిసికొట్టినట్టు కనిపిస్తుంది.
సిబిల్ చిక్కులు
బ్యాంకు లింకేజీ ఉండే యూనిట్లకు సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. చాలా మందికి సరైన సిబిల్ స్కోర్ లేకపోవడంతో రుణాల మంజూరుపై సందిగ్ధత ఏర్పడింది. ఈ పథకానికీ, సిబిల్ స్కోరుకు సంబంధం లేదని ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించినప్పటికీ, సిబిల్ సరిగా లేనివాళ్లను బ్యాంకర్లు ఎంపిక చేయలేదు. పథకం దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత చాలా మందికి కొత్తగా రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. దీంతో ఈ పథకాన్ని తమకూ వర్తింపజేయాలనే డిమాండ్లూ పెరిగాయి.
ఎంపికలో రాజకీయ జోక్యం
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారులే చేస్తారని నిబంధనల్లో పేర్కొన్నా.. తుది జాబితాకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేయడంతో ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేలు సూచించిన వారినే ఎంపిక చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధుపై వచ్చిన వ్యతిరేకతే, ఇప్పుడు యువ వికాసానికి కూడా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందనే ఆందోళన అధికారపార్టీ నేతల్లో కనిపిస్తున్నది. అయితే ‘స్థానిక’ ఎన్నికలకు ముందే ఫస్ట్ కేటగిరిలోని దరఖాస్తుదారులకు రుణమంజూరీ పత్రాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
నిధులే సమస్య
రాజీవ్ యువవికాసం పథకానికి ప్రధానంగా నిధుల సమస్య వెంటాడుతుంది. ప్రాధాన్యత క్రమంలో రూ.లక్షలోపు ఖరీదయ్యే యూనిట్లకు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావిస్తే, అందుకు భిన్నంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖరీదయ్యే యూనిట్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీనితో సర్కారు అంచనాలు తారుమారయ్యాయి. ఈ ఆరంభ శూరత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలే చేస్తున్నాయి.
రైతుల ఆసక్తి
ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి సర్కారు అవకాశం కల్పించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి గరిష్ఠ వయోపరిమితిని 60 ఏండ్లుగా నిర్ణయించింది. దీనితో ఈ పథకంపట్ల రైతులు ఎక్కువ ఆసక్తి చూపారు. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. అయితే వీటి ఏర్పాటులో గతంలో జరిగిన అక్రమాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
వికసించని రాజీవ్ యువవికాసం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES