– ఆ ప్రసంగాల నియంత్రణకు చర్యలు చేపట్టండి
– భావ ప్రకటనా స్వేచ్ఛను హరించొద్దు : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
– పౌరుల్లో సోదరభావం ద్వేషాన్ని తగ్గిస్తుంది
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఆ ప్రసంగాల నియంత్రణకు చర్యలు కూడా చేపట్టాలని సూచించింది. అలా అని పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ పవిత్రతను హరించకూడదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్టా పనోలీపై ఫిర్యాదు చేసిన వజహత్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ద్వేషపూరిత ప్రసంగం అదుపు లేకుండా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని, సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. పౌరులలో ఎక్కువ సోదరభావం ద్వేషాన్ని తగ్గిస్తుందని స్పష్టం చేసింది. పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, అటువంటి కంటెంట్‌ను నియంత్రించడానికి మార్గాలను కనుగొనాలని కేంద్రం, రాష్ట్రాలను కోరింది.
‘విద్వేష ప్రసంగాలు చేసే వారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి వ్యాఖ్యలను షేర్ చేయకుండా కొన్ని కట్టడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి వాటిని షేర్ చేయకుండా సంయమనం పాటించాలి. మేం ఇక్కడ సెన్సార్‌షిప్ గురించి మాట్లాడట్లేదు. కానీ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అలాంటి ప్రసంగాలను ఎందుకు అసభ్యకరంగా, సరికానిదిగా భావించడం లేదు? పౌరుల మధ్య సోదరభావం ఉండాలి. అప్పుడే ద్వేషమంతా తొలగిపోతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విభజన ధోరణిని అడ్డుకోవాల్సిందే’ అని ధర్మాసనం పేర్కొంది. ‘ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుత ఆంక్షలు సరైనవే. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యవక్తీకరణ విలువలను ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా, విద్వేషపూరిత ప్రసంగాలను నిలువరించే మార్గాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు కోరింది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని, కానీ అది దుర్వినియోగం కావడం పెరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. ప్రజల వాక్, వ్యక్తీకరణ ప్రాథమిక హక్కును ఆస్వాదించాలనుకుంటే, అది సహేతుకమైన పరిమితులతో ఉండాలని జస్టిస్ నాగరత్న అన్నారు. దాంతో పాటు విలువైన స్వేచ్ఛను ఆస్వాదించడానికి స్వీయ నియంత్రణ కూడా ఉండాలని పేర్కొన్నారు. పౌరులు తమను తాము ఎందుకు నియంత్రించుకోలేరని ప్రశ్నించారు. వారు ఈ హక్కు విలువను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. అలా చేయడంలో విఫలం అయితే, రాష్ట్రం జోక్యం అనివార్యమవుతుందని, అది ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రాథమిక విధుల్లో ఒకటి, కాబట్టీ అది ఉల్లంఘనకు గురికాకూడదని స్పష్టం చేసింది.
ఓకే వ్యక్తిపై బోలెడు ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు?
ఈ కేసుపై జూన్ 24న చేసిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విశ్వనా థన్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రంతో సహా అసోం, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఏకీకతం చేయాలని కోరుతూ వజాహత్ ఖాన్ చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోరింది.