Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజివీడీసీల అరాచక పర్వం

వీడీసీల అరాచక పర్వం

- Advertisement -

నిజాం కాలంలో సమాజం ఎలా ఉండేదో వేరే చెప్పక్కర్లేదు. చరిత్ర తెలిసినవారందరికీ అవగతమే. రాజు ఏమడిగినా ప్రజలు కాదనకుండా ఇచ్చేవారు.కాపరుల నుంచి గొర్రెల్ని, కుమ్మరుల నుంచి కుండల్ని, చేతివృత్తుల ద్వారా తయారు చేసిన అన్నింటిని ఉచితంగా పొందేవారు. లేదంటే కొరడా దెబ్బలు, శిక్షలు, రాజ్య బహిష్కరణలు ఉండేవి. ఇది అప్పటి రాచరిక దుర్మార్గం. కాలక్రమేణా రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ, వాటి మూలాలు మాత్రం మానవ సమాజాన్ని నేటికీ వేధిస్తూనే ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో అలాంటి భూస్వామ్య, పెత్తందారి విధానాల్ని అవలంభిస్తున్న విలేజ్‌ డెవలప్‌మెంట్‌ (వీడీసీ)ల ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుల బలం, ధనబలం, అధికారబలం అండతోనే ఇవి కొనసాగడం విచారకరం. ఇలాంటి ఆగడాల్ని అరికట్టాల్సిన పాలకులు చేష్టలూడిగి చూస్తుండటం మరీ బాధాకరం. జరిమానా కట్టలేదని తాళ్లరాంపూర్‌లో నలభై గౌడ కుటుంబాల్ని సాం ఘీక బహిష్కరణ చేయడం హేయం. స్పందించిన సీపీఐ(ఎం) బాధితులకు అండగా నిలబడింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టింది. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుల్ని మాత్రం ఇంకా అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో గ్రామాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడేవారు. తర్వాత పరిస్థితులు మారాయి. గ్రామ అభివృద్ధి కమిటీలతో ఇంకా దిగజారాయి. పాలకుల అండతో వీడీసీలు చేస్తున్న ఆగడాలు మితి మీరాయి. గ్రామస్తుల్ని మానసికంగా వేధిస్తున్నాయి. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో కొన్ని నెలలుగా గౌడ కుల స్తులకు వీడీసీ పెద్దలకు మధ్య వివాదం నడుస్తోంది. ఊరిలో తాటిచెట్లపై గీతకార్మికులకే హక్కుండాలి. అది వారి కుల వృత్తి, జీవనాధారం. అయితే అడిగిన సందర్భంలో తాటిచెట్టు ఎక్కి కల్లుపోయలేదనే నెపంతో ఏడాదికోసారి చెల్లించే టెండర్‌ డబ్బుల్ని రెట్టింపు చేసింది వీడీసీ. ఇది మాకు సాధ్యం కాదన్నా ‘మేం చెప్పినట్టు వినకుంటే ఇలాంటి శిక్షలే ఉంటాయి’ అని గ్రామాల్లో కొన్నింటిని ఉదహరించి మరీ వారిని బెదిరించారు. అంతటితో ఆగలేదు. గౌడ కులస్తులకు ఎవరు సహాయం చేసినా, మాట్లాడినా ఐదు వేల రూపాయల జరి మానా కూడా విధిస్తామని చాటింపు చేశారు. ఇది సహాయనిరాకరణగా సాగింది. వేధింపుల్ని తట్టుకోలేక కొంతమంది పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినా ఫలితం లేదు!
ఆర్మూర్‌ ప్రాంతంలోని మూడు నియోజక వర్గాలు, సుమారు రెండు వందల గ్రామాల్లో వీడీసీ చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా నడుస్తోంది. ఈ కమిటీలో భూస్వాములు, పెత్తందారులే ఉంటారు. పండగైనా, పబ్బమైనా ప్రతీ కులం ఎంతోకొంత ముట్టచెప్పాల్సిందే! దీనికి లెక్కాపత్రం ఏమీ ఉండదు. లేదంటే బెదిరింపులు, జరిమానాలు, బహిష్కరణలు ఉంటాయి. నందిపేట్‌ మండలంలో గొర్రెలడితే ఇవ్వనందుకు గొల్లకుర్మలను గ్రామం నుంచి బహిష్కరించారు. మాక్లూర్‌ మండలంలో దళిత మహిళా సర్పంచ్‌ చేయి విరిచారు. సుబ్రియల్‌ గ్రామం నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టకూడదని రాద్ధాంతం చేశారు. పండగల సందర్భంగా దళితుల్ని గుళ్లలోకి కూడా రానివ్వడం లేదు. కోమన్‌పల్లి గ్రామంలో ప్రయివేటు భూమికి సంబంధించిన ఓ సర్వేలో నాయక్‌ పోడ్‌కులానికి చెందిన ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టడంతో ఆగ్రహించిన వీడీసీ ఏకంగా యాభై మందిని ఊరినుంచి బహిష్కరించింది. కనీసం వీరికి హోటళ్లలో టీ కూడా ఇవ్వలేదు. జబ్బు చేస్తే ఆర్‌ఎంపీ వైద్యుడు కూడా రాలేదు. ఇలాంటి పెత్తందారి విషసంస్కృతి వీడీసీల పేరుతో గ్రామాల్ని చుట్టుముట్టడం ఆందోళన కలిగించే అంశం. చట్టాన్ని ఉల్లంఘించే ఈచర్యల పట్ల పోలీసులు కూడా కిమ్మనకపోవడం చూస్తే ‘అధికారం’ అండతోనే అనే వాదన కూడా వినిపిస్తోంది.
భూస్వామ్య,పెత్తందారి వర్గాలు గ్రామాల్లో దుందుడుకు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. అందుకు వీడీసీలనే ఉదాహ రణగా చెప్పొచ్చు. గ్రామాల్లోనున్న భూముల్ని ఆక్రమించు కోవడం, దళితుల్ని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, కిరణాషాపులు, బేకరీలు, వైన్స్‌, మార్కెట్‌, వడ్డీ వ్యాపారాలు వారి కిందే ఉంచుకోవడం వల్ల ఆధిపత్య వైఖరి ‘చట్టబద్ధంగా’ చెలామణి అవుతున్నది. రానురానూ అది ప్రజల్ని జలగల్లా పీలుస్తోంది. తమ మాట వినట్లేదేనే అహంకార ధోరణి భూస్వామ్య విధానం నుంచి వచ్చినదే. ఇది దౌర్జన్యాలకు పాల్పడటం, అక్రమంగా సంపాదించడం, దోపిడీలకు తెగబడటాన్ని ప్రేరేపిస్తున్నది. సమాజంలో అన్ని కులాల్ని, మతాల్ని గౌరవించాలనే సంప్రదాయానికి పాతరేసింది. ఆ గౌరవం, మర్యాద ఇవ్వలేదనే, తమ మాటకు భంగం వాటిల్లిందనే తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తుల్తి బహిష్కరించింది. ఇది మూలం. మరి దీనికి విరుగుడు ఏంటి? ఇప్పుడు పౌర సమాజం ఆలోచించాలి.అధికార కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు వీడీసీల పట్ల తమ వైఖరి ఏమిటో తేల్చమని నిలదీయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు