Tuesday, April 29, 2025
Homeరాష్ట్రీయంసాగుకు ఆధునిక సాంకేతికత

సాగుకు ఆధునిక సాంకేతికత

– రైతులకు మెళకువలు అందించేందుకే రైతు మహోత్సవం
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ పూడికతీత పనులకు నెలాఖరులోగా టెండర్లు : ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– నిజామాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం
– ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు
– కూలిన స్వాగత తోరణం
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయంతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెళుకువలను అందించడానికి రైతు మహౌత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని, దీన్ని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అందరి కోరిక మేరకు నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, పసుపు ఆధారిత పరిశ్రమలు, ఉత్పత్తులకు కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 21-23వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న రైతు మహోత్స కార్యక్రమాన్ని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతు మహౌత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్‌ను మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్టాల్స్‌ సందర్శించి, నూతన ఆవిష్కరణలు, ఆధునాతన వంగడాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను పరిశీలిస్తూ, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐదు జిల్లాల నుంచి రైతులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. అత్యంత లాభదాయకమైన పామాయిల్‌ పంటను జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, అందువల్ల దీన్ని రైతులు సాగు చేయాలని కోరారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్‌ ఇరిగేషన్‌ను మళ్లీ పునరుద్ధరిస్తూ, నిజామాబాద్‌ జిల్లాకు వీటి మంజూరీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల్లో పూడికతీత పనుల కోసం ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పూడిక తొలగింపు ద్వారా లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీటి వసతి సమకూరుతుందని అన్నారు. కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్‌ పనులతో పాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనుల పూర్తికి అవసరమైన నిధులను కేటాయించి పూర్తి చేయిస్తామన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగానికి రూ.1.81 లక్షల కోట్లు వెచ్చించినప్పటికీ ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి రూ.1.25 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీల పనులను కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక, కాళేశ్వరం ప్రాజెక్టు చుక్క నీటిని కూడా వినియోగించకుండానే రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే అత్యధికంగా వరి పంటను పండించి సరికొత్త రికార్డును సృష్టించామని హర్షం వెలిబుచ్చారు. గత ఖరీఫ్‌, రబీ సీజన్లను కలుపుకుని 281 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పంట తెలంగాణాలో ఉత్పత్తి అయ్యిందని, దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగు కాలేదని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతాంగానికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానా ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, డాక్టర్‌ భూపతిరెడ్డి, ధన్పాల్‌ సూర్యనారాయణ, రాకేష్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
కూలిన స్వాగత తోరణం
కాగా, మంత్రులు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో కార్యక్రమం నిర్వహించనున్న జీజీ కాలేజీ ప్రాంగణానికి చేరుకున్నారు. హెలిక్యాప్టర్‌ ల్యాండింగ్‌ అయ్యే సమయంలో వీచిన గాలికి ఒక్కసారిగా దుమ్ము రేగింది. గాలి తీవ్రతకు అక్కడ ఏర్పాటు చేసి స్వాగత తోరణం కూలింది. స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన కొన్ని టెంట్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా దుమ్ము రేగడంతో కార్యక్రమానికి వచ్చిన రైతులు, మహిళలు, కార్యకర్తలు పరుగులు తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img