– తెలంగాణ చేతివృత్తిదారుల సమన్వయకమిటీ చైర్మెన్ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – ముషీరాబాద్
చేతివృత్తిదారుల సంక్షేమంకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ చేతివృత్తి దారుల సమన్వయ కమిటీ చైర్మెన్ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీసీలకు బడ్జెట్‌లో నామమాత్ర కేటాయింపులు చేసి వారి సంక్షేమాన్ని విస్మరిం చిందన్నారు. బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడం వల్ల చేతివృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కులవృత్తుల్లోకి పెట్టుబడిదారులు ప్రవేశించడం వల్ల కార్పొరేట్ పోటీని తట్టుకోలేక బీసీలు కార్మికులుగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఆకలిచావులు, ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. లిక్కర్, కూల్ డ్రింక్స్ కంపెనీల ప్రభావంతో కల్లుగీత వృత్తి మనుగడ కష్టంగా మారిందని, యాంత్రీకరణ కారణంగా రజక, నాయీబ్రాహ్మణ వంటి సేవావృత్తులు ఆదాయం కోల్పోతున్నాయని వివరించారు. వీరందరికీ ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులు సమర్థవంతంగా వినియోగం కావడా నికి బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, మత్స్యకార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా, ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25లక్షల మంది చేతివృత్తులపై ఆధారపడి జీవి స్తున్నారని తెలిపారు. వృత్తుల్లో ఆధునీకరణ, ఉపాధి మెరుగు దలకు కార్పొరే షన్లకు నిధులు కేటాయించి విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామీణ స్థాయిలో నిరసనలు చేపట్టి ఉద్య మాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చేతివృత్తి దారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ చేతివృత్తుల సంఘాల నేతలు కిల్లె గోపాల్, రవీందర్, ఏదునూరి మదార్, వి.వెంకట నర్సయ్య, వెంకటేశ్వర్లు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళి, చాంద్‌పోషా, గుమ్మడి రాజు నాగరాజు, కురెళ్ల నరసింహాచారి, రాళ్లబండి కుమారస్వామి, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు ఇ.సాయిలు, వల్లపు విగేష్, క్షౌర వృత్తిదారుల సంఘం నాయకులు ప్రసాదం విష్ణు, మల్లేషం, దుర్గయ్య, శ్రీకాంత్, జయరాములు, గోవింద్, గోపి, వెంకట్ గౌడ్, రమేష్ గౌడ్, నర్సింహా, అశోక్, చేతివృత్తిదారులు పాల్గొన్నారు.
చేతివృత్తిదారుల సంక్షేమానికి రూ.25వేల కోట్లు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



