Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంసర్‌ దెబ్బకు 1.70 కోట్ల ఓట్ల తొలగింపు

సర్‌ దెబ్బకు 1.70 కోట్ల ఓట్ల తొలగింపు

- Advertisement -

తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ చర్య
జాబితాను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) అనంతరం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.70 కోట్లకుపైగా ఓటర్లను ఈసీ తొలగించింది. గతేడాది అక్టోబరులో సర్‌ ప్రక్రియ ప్రారంభానికి మునుపు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21.45 కోట్ల మంది ఓటర్లున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ప్రచురించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది.

అంటే 7.93శాతం తగ్గుదల నమోదైంది. గుజరాత్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, గోవా, కేరళ, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐలాండ్స్‌కు చెందిన తుది ఓటరు జాబితాలను ఈసీ గతవారం విడుదల చేసింది. వాటిని విశ్లేషించగా ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాల నుంచి అనర్హులను తొలగించాలన్న లక్ష్యంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. తొలుత బీహార్‌లో ఈ ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్‌ కొనసాగుతోంది.

ఇప్పటి వరకు 2.16 కోట్ల ఓట్ల తొలగింపు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో సర్‌ ప్రక్రియ తర్వాత విడుదల చేసిన గణాంకాలను కూడా కలుపుకుంటే మొత్తం తొలగింపుల సంఖ్య 2.16 కోట్లకు చేరాయి. అంటే 7.37 శాతం మంది ఓటర్లను తొలగించారు. బీహార్‌లో 2025 జూన్‌లో 7.89 కోట్ల ఓటర్లున్నారు. సెప్టెంబర్‌ 2025లో నాటికి ఈ సంఖ్య 7.43 కోట్లకు తగ్గింది.

ఇంకా విడుదల కావాల్సిన రాష్ట్రాలు
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల ఓటర్ల జాబితా ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. తమిళనాడు తుది జాబితా సోమవారం వెల్లడి కానుంది. పశ్చిమ బెంగాల్‌లో దశలవారీగా విడుదల చేయనున్నట్టు సమాచారం. ఏప్రిల్‌ 6న ఉత్తరప్రదేశ్‌ తన జాబితాను విడుదల చేయనుంది.

అసోంలో ప్రత్యేక సవరణ
అసోంలో సర్‌కు బదులుగా స్పెషల్‌ రివిజన్‌ను చేపట్టారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 10న పూర్తయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో 2.45 కోట్ల ఓటర్లున్నారు. ముసాయిదా జాబితాలో 2.52 కోట్లు కాగా, తుది జాబితాలో 2.49 కోట్ల ఓటర్లున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -