Tuesday, October 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు

- Advertisement -

21వరకు నామినేషన్ల స్వీకరణ, 22న పరిశీలన
నోటిఫికేషన్‌ విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మొదటిరోజు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి పెద్దమొత్తంలో నామినేషన్లు దాఖలు చేస్తామని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ కందరపల్లి కాశీనాథ్‌ ప్రకటించారు. మరోవైపు ఉద్యమకారులను విస్మరించిన పార్టీలకు ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతామంటూ టీయూ జేఏసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు హెచ్చరించారు.

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల్లోని 58 కులాలకు తీరని అన్యాయం జరిగిందని, అందుకే జిల్లాల వారీగా 200 మంది మాలలు నామినేషన్లు వేస్తారని ఆ సంఘానికి చెందిన నేతలు తెలిపారు. ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకు పలువురు నామినేషన్లను దాఖలు చేయగా రిటర్నింగ్‌ అధికారి పి.సాయిరాం స్వీకరించారు. అందులో రెండు రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు కాగా, 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణా పునర్‌ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్‌, నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్‌, పెసరకాయల పరీక్షిత్‌రెడ్డి, చలిక చంద్రశేఖర్‌, సపవత్‌ సుమన్‌, వేముల విక్రమ్‌రెడ్డి, ఇబ్రహీం ఖాన్‌, సయ్యద్‌ ముస్తఫా హుస్సేన్‌, సల్మాన్‌ ఖాన్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు.

జిల్లా ఎన్నికల అధికారి సందర్శన
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌ సందర్శించారు. ‘ఇర్‌వో, ఏఆర్‌వోలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ‘ఇసీఐ’ నిబంధనలకు లోబడి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, నామినేషన్‌ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తిచేస్తామని తెలిపారు.

24వరకు సమయం
ఉప్ప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట్ల విజయబాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్లను పరిశీలన, నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 24వరకు సమయం ఉంది. నవంబర్‌ 11న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. ఈనెల 21 వరకు నామినేషన్లకు అవకాశం ఉండటంతో పెద్దఎత్తున దాఖలయ్యే అవకాశముందని జీహెచ్‌ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -