Sunday, September 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగుల జీతంలో 10 శాతం తల్లిదండ్రుల ఖాతాల్లోకి

ఉద్యోగుల జీతంలో 10 శాతం తల్లిదండ్రుల ఖాతాల్లోకి

- Advertisement -

త్వరలో చట్టం తెస్తాం
పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదు
పదేండ్ల పాలకులు విశ్వాసఘాతకులు : గ్రూప్‌-1 అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
మేథోశక్తిని చాటాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘పిల్లల చదువులు, ఉద్యోగాల సాధన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. అవసరమైన డబ్బులు ఇస్తూ, వారి భవిష్యత్‌ కోసం సర్వం త్యాగం చేస్తారు. ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. అలా చేస్తే ఉద్యోగుల జీతంలో పది శాతం కోత విధించి, పేరెంట్స్‌ ఖాతాల్లో వేస్తాం. దీనిపై త్వరలోనే చట్టం తెస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారంనాడిక్కడి శిల్పకళావేదికలో గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందచేశారు. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకుగాను 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ 18 శాఖలకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ గడ్డకు చరిత్ర, పౌరుషం ఉన్నాయనీ, ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం తెలంగాణలో అనేక పోరాటాలు ఇదే చైతన్యంతో జరిగాయని వివరించారు. పదేండ్లు అధికారంలోఉన్నా, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, నిరుద్యోగుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నమ్మకద్రోహులుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్ధాల ఉద్యమాన్ని ఒకే కుటుంబం, ఒకే పార్టీకి ఆపాదించుకోవాలని చూశారనీ, ప్రజలు రెండు సార్లు గెలిపించేసరికి కారణజన్ములమనుకుని విర్రవీగారని విమర్శించారు. అలాంటి విశ్వాసఘాతకులు ఉద్యమకారులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పదేండ్ల పాలనలో టీజీపీఎస్సీని అంగడిసరుకుగా మార్చారనీ, దానిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ను సభ్యుడిగా నియమించి, ప్రశ్నాపత్రాలను జిరాక్స్‌ కేంద్రాల్లో అమ్ముకున్నారని ఆక్షేపించారు.

టీజీపీఎస్సీని యూపీఎస్సీ కంటే మెరుగ్గా తీర్చిదిద్దామనీ, ఉన్నత హోదాల్లో ఉన్న వారిని చైర్మెన్లు, సభ్యులుగా నియమించామని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదని చెప్పారు. కొందరు కడుపు నిండా విషం పెట్టుకుని అభ్యర్థులను దెబ్బతీయాలనుకున్నారని వ్యాఖ్యానించారు. గ్రూప్‌-1 పోస్టుల్ని రూ.రెండు కోట్లు, మూడు కోట్లకు అమ్ముకున్నానని తనపై కొందరు ఆరోపణలు చేశారని చెప్పారు. అసలు ఏనాడైనా మీతో కలిసి చారు అయినా తాగానా?అని ప్రశ్నించారు. 2023 డిసెంబర్‌లో కూడా ఇంత ఆందోళన చెందలేదనీ, గ్రూప్‌-1 నియామకాల విషయంలో ఆందోళన చెందానని అన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థుల భవిష్యత్తే, తెలంగాణ భవిష్యత్‌ అని చెప్పారు. ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ మోడల్‌ను తయారు చేయాలని కోరారు. కోచింగ్‌ సెంటర్ల కుట్రను అర్థం చేసుకోవాలనీ, హైకోర్టులో వాదించిన న్యాయవాదుల వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. 2011లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వస్తే, 2018లో నియామకాలు జరిగాయని గుర్తు చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి, నియామకాలను పూర్తి చేశామన్నారు.

2035 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు జీడీపీకి మూడు శాతం ఇస్తున్నామనీ, దాన్ని పది శాతానికి పెంచాలని చెప్పారు. రాజకీయాల్లోకి, ఉద్యోగంలోకి కొత్తగా వచ్చినపుడు గరం గరంగా ఉంటారనీ, తర్వాత నరం నరంగా మారతారనీ, ఆ తర్వాత బేషరంగా మారతారని అన్నారు. ఇది తప్పు అని నిరూపించే అవకాశం ఉద్యోగులపై ఉందన్నారు. నిస్సహాయ స్థితిలో ఉండే వారు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారనీ, ఆ సమయంలో తల్లిదండ్రులు గుర్తుకురావాలని కోరారు. నిన్నటి వరకు నిరుద్యోగులనీ, ఇప్పుడు అధికారులుగా మారబోతున్నారని చెప్పారు. అందరం కలిసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మేథోశక్తిని చాటాలి: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగానే ప్రజాప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని అన్నారు. గత పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నా, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంపదను అందరికీ సమానంగా పంచడం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఫ్యూచర్‌సిటీని నిర్మించి, మూసీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. పేద కుటుంబాల నుంచి ఎన్నికైన గ్రూప్‌-1 అభ్యర్థుల నియామకపత్రాలు అడ్డుకునే వారికి ఈ కార్యక్రమంతో చెంపదెబ్బ కొట్టినట్టేనని అన్నారు.

అవినీతికి పాల్పడొద్దు : సీఎస్‌
అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా ఉద్యోగాలు చేయాలని సీఎస్‌ రామకృష్ణారావు అన్నారు. గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని చెప్పారు. సీఎం, పీఎంలు దిశా, దశ చూపిస్తే సైనికులుగా పనిచేసేది అధి కారులు, ఉద్యోగులేనని అన్నారు. ప్రజా సంక్షేమమే ఉద్యోగులకు పరమావధిగా ఉండాలన్నారు. అనంతరం గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన వారితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, ఎంపీలు బలరాం నాయక్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ జితేందర్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -