Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంబీమాలో వంద శాతం ఎఫ్‌డీఐలు

బీమాలో వంద శాతం ఎఫ్‌డీఐలు

- Advertisement -

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లు ఆమోదం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని వంద శాతానికి పెంచే బీమా సవరణ బిల్లు (సబ్‌ కా బీమా సబ్‌ కా రక్ష)ను ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఒక పూటలోనే జరిగింది. ట్రంప్‌ పరిపాలన ఒత్తిడికి తలొగ్గి, అణు విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించడంతో పాటు బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని వంద శాతానికి పెంచుతున్నారు. సీపీఐ(ఎం) లోక్‌సభాపక్షనేత కె. రాధాకృష్ణన్‌ సహా ప్రతిపక్షసభ్యులు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించి, ఏకపక్షంగా ఆమోదించింది. బిల్లు చట్టంగా మారిన తరువాత బీమా రంగంలో విదేశీ గుత్తాధిపత్యాలు భారత్‌లో పూర్తి స్వేచ్ఛను పొందుతాయి. లాభం ఆధారంగా మాత్రమే పనిచేసే విదేశీ కంపెనీల ప్రవేశం ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ముప్పును కలిగిస్తుంది. అంతేకాక దేశంలోని లక్షలాది మంది బీమా ఏజెంట్లకూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. బీమాయేతర కంపెనీలు బీమా కంపెనీతో విలీనం కావడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. చైర్‌పర్సన్‌, బోర్డు సభ్యుల పదవీకాలం గరిష్టంగా ఐదేండ్లు లేదా 65 ఏండ్ల వరకు ఉంటుంది. గతంలో బోర్డు సభ్యుల వయోపరిమితి 62 ఏండ్ల వరకు ఉండేది.

బిల్లును ఉపసంహరించుకోవాలి: సీపీఐ(ఎం) ఎంపీ కె. రాధాకృష్ణన్‌
బీమా రంగాన్ని పూర్తిగా విదేశీ గుత్తాధిపత్య సంస్థలకు తెరిచే బీమా సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలి. ఇది సామాజిక భద్రతకు దూరంగా కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం బీమా రంగాన్ని తెరిచే బిల్లు. ఎల్‌ఐసీ, జనరల్‌ ఇన్సూరెన్స్‌ వంటి మన ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తుంది. బీమా రంగంలో పార్లమెంటరీ పర్యవేక్షణ, నియంత్రణ యంత్రాంగాలు నాశనం అవుతాయి. బిల్లుకు ఇచ్చిన ”సబ్‌ కా బీమా సబ్‌ కీ రక్ష” అనే కొత్త నినాదం ఆచరణలో లేనందున కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి.

వికలాంగుల జీవనోపాధిపై దెబ్బ
తక్షణమే కొత్త బిల్లును ఉపసంహరించాలి
ఎన్‌పీఆర్‌డీ సహా పలు వేదికల డిమాండ్‌

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌)బిల్లు, 2025 -(వీబీ-జీఆర్‌ఏఏంజీ)ను తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్‌పీఆర్‌డీ)తో సహా పలు సంస్థలు, సంఘాలు, తీవ్రంగా వ్యతిరేకించాయి. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. ఒకపక్క అంగవైకల్యంతో బాధపడేవారు మరోపక్క నిరుద్యోగం, కటిక దారిద్య్రంతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారని, అలాంటివారికి ఈ పథకం ద్వారా కొద్దిపాటి అవకాశాలనైనా కల్పించేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. పరిమిత స్థాయిలో లభించే ఈ ఉపాధి కూడా గత కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన నిధుల లేమితో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పైగా పనులను తిరస్కరించడం, డిజిటల్‌ అటెండెన్స్‌ వ్యవస్థలు విఫలం కావడం, పని ప్రదేశాల్లో సహేతుకమైన వసతి లేకపోవడం వంటి ఇబ్బందులు పట్టి పీడిస్తూ వచ్చాయని ఎన్‌పిఆర్‌డి సహా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

2023-24లో ఈ పథకం కింద 6,38,088మందికి ఉపాధి కల్పించినట్లు రాజ్యసభ ప్రశ్నోత్తారాల ద్వారా తెలిసింది. ఈ దశలో ఈ చట్టం స్థానంలో వేరేది తీసుకురావాలన్న ఆలోచనతో వికలాంగులైన గ్రామీణ కార్మికుల జీవనోపాధి మరింత దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. తద్వారా వారు మరింత పేదరికంలోకి నెట్టబడతారని అన్నారు. కొన్ని పరిమితులు వున్నా ఈ చట్టం కింద వైకల్యం వున్న వ్యక్తులను ఉపాధికి అర్హమైనవారుగా చట్టబద్ధంగా గుర్తించారు. వారికి అర్హమైన పనులను ఇస్తూ వారికి ఉపాధి రక్షణ కల్పించారు. కానీ కొత్తగా తీసుకువస్తున్న ప్రతిపాదిత బిల్లు ఈ హక్కును నీరు గారుస్తోందని విమర్శించారు. వికలాంగులను మినహాయించడాన్ని కూడా చట్టబద్ధం చేస్తోందన్నారు. తద్వారా వికలాంగుల ఉపాధి ముప్పులో పడుతోందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. వికలాంగుల హక్కుల చట్టం, 2016ను ప్రతిపాదిత బిల్లు ఉల్లంఘిస్తోంది. ఈ పరిస్థితుల్లో తక్షణమే కొత్త బిల్లును ఉపసంహరించాలని ఎన్‌పీఆర్‌డీ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, తెలంగాణా, పలు రాష్ట్రాల వికలాంగుల హక్కుల సంస్థలు డిమాండ్‌ చేశాయి. ఉపాధిని కాపాడేందుకు ఇతర ప్రజాస్వామ్య సంఘాలతోకలిసి పోరాడతామని పేర్కొన్నాయి.

కొత్త అణు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలి
ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టవద్దు : ఈఈఎఫ్‌ఐ డిమాండ్‌
అణు ఇంధన చట్టం-1962, అణు నష్టపరిహార పౌర బాధ్యత చట్టం-2010 ఈ రెండింటినీ రద్దు చేసి వాటి స్థానంలో ఎస్‌హెచ్‌ఏఏన్‌టీఐ (సస్టైన్‌బుల్‌ హార్నెసింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) బిల్‌, 2025ను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ చర్య భారతదేశ అణు చట్రపరిధి యంత్రాంగంపై తీవ్రమైన, ప్రమాదకరమైన దాడి అని భారత విద్యుత్‌ ఉద్యోగుల సమాఖ్య (ఈఈఎఫ్‌ఐ) పేర్కొంది. కీలకమైన భద్రతా, జవాబుదారీ యంత్రాంగాలను ఈ బిల్లు తొలగిస్తోందని, అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ఇంధన రంగానికి పెద్ద ఎత్తున ప్రయివేటు, విదేశీ ప్రాతినిధ్యానికి తలుపులు తెరుస్తోందని విమర్శించింది. అణు ఇంధనానికి సంబంధించిన చట్టాలకు మార్పులు చేయడానికి ముందుగా ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించి, పూర్తి స్థాయిలో పారదర్శక రీతిలో ప్రజా విచారణలు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అలాగే స్వతంత్ర సాంకేతిక నిపుణులు పాల్గొనాలని కోరింది.

అనంతరం పార్లమెంటరీ సెలక్ట్‌ కమిటీని నివేదించాలని కోరింది. ఇందుకు సంబంధించి తీసుకువచ్చే ఏ కొత్త చట్టమైనా నిజమైన స్వతంత్ర అణు భద్రతా అథారిటీని నిర్వచించాలని ఈఈఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. మన దేశ భద్రత, సార్వభౌమాధికార్గానికే మనం ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. ప్రయివేటు ప్రాతినిధ్యాన్ని కీలకమైన ఆర్థిక లక్ష్యంగా పేర్కొంటున్న ఈ బిల్లు కార్మికుల రక్షణ యంత్రాగాన్ని, ఉపాధి భద్రతను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనివ్వలేదని పేర్కొంది. కాంట్రాక్టర్లు, సరఫరాదారులకు లైసెన్సులిచ్చే క్లాజుల్లో కఠినమైన కార్మిక ప్రమాణాలు లేవని, యూనియన్‌ గుర్తించిన హక్కులు గురించి ప్రస్తావన లేదని, తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా శిక్షణా నిబంధనలు లేవని ఈఈఎఫ్‌ఐ పేర్కొంది. ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే తీసుకునే చర్యలు, విధించే శిక్షల గురించి కూడా లేదని పేర్కొంది. నిరంకుశమైన ఈ బిల్లును తీవ్రంగా నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాల్సిందిగా విద్యుత్‌ ఉద్యోగులకు, ఇంజనీర్లుకు, ప్రజలకు ఈఈఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -