49 మందిపై రూ.1.06 కోట్ల రివార్డు
ఇప్పటివరకు 410 మంది మావోయిస్టుల సరెండర్
421 మంది అరెస్టు, 37 మంది ఎన్‌కౌంటర్
నవతెలంగాణ-చర్ల
మావోయిస్టు పార్టీకి సమ్మెట దెబ్బలు నానాటికి అధికమవుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఏకంగా 103 మంది మావోయిస్టులు ఒక్క సారే లొంగిపోవడం ఆపార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందిస్తామన్న నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై పూర్తిగా కేంద్రీకరించి బలగాలతో గాలిం పు చర్యలు ముమ్మరం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యాలను భద్రతా బలగాలు రోజూ జల్లెడ పట్టడం పేరిట పచ్చటి అడవుల్లో నెత్తుటి ఏర్లు పారిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అనేకమార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. దాంతో కింద స్థాయి గ్రామ కమిటీల నుంచి ఏరియా కమిటీ, కమాండర్ స్థాయి వరకూ లొంగుబాటు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. ‘నాయాద్ నల్ల ఇరికె’ ‘లోన్ వరాట్’తో పాటు వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ల వల్ల మావోయిస్టు పార్టీ సభ్యులు దండకారణ్యాన్ని వదిలి అభివృద్ధి కోసం ఆత్మసంరక్షణ బాటలో పడ్డారని అన్నారు. ఇప్పటివరకు 410 మంది లొంగిపోయారని, 421 మంది అరెస్టు చేసినట్టు, 37 మంది ఎన్ కౌంటర్‌లో మృతి చెందినట్టు చెప్పారు. కాగా, లొంగిపోయిన 103 మందిలో 49మందిపై నూ. 1.06 కోట్ల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు ఆయా జిల్లాల పోలీస్ అధికారులు ప్రోత్సాహకాలతో పాటు సదుపాయాలు కల్పిస్తున్నారు.