ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం
9.35 వరకు అనుమతి
అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి
హాజరు కానున్న 5,28,239 మంది విద్యార్థులు
ఏర్పాట్లు పూర్తి చేసిన పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు కొనసాగే ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనున్నాయి. అదనంగా
ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9.35 గంటల వరకు అనుమతించనున్నారు. విద్యార్థులు పరీక్షల ప్రారంభానికి అరగంట ముందే చేరుకోవాల్సి ఉంది. ఈ పరీక్షలు రాసేందుకు రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది నమోదు చేసుకోగా వారిలో 2,60,916 మంది బాలురు, 2,56,811 మంది బాలికలున్నారు. ఒకసారి ఫెయిలైన విద్యార్థులు 10,512 మంది ఉండగా వారిలో 7,038 మంది బాలురు, 3,474 మంది బాలికలున్నారు.
మొత్తంగా పరీక్షలను 5,28,239 మంది విద్యార్థులు రాయనుండగా వారిలో 2,67,954 మంది బాలురు, 2,60,285 మంది బాలికలున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది (బాలురు 98,943, బాలికలు 1,08,630), సంక్షేమ పాఠశాలల నుంచి 60,139 మంది (బాలురు 26,248, బాలికలు 33,891) ప్రయివేటు స్కూళ్ల నుంచి 2,50,015 మంది (బాలురు 1,35,725, బాలికలు 1,14,290) ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల (ప్రభుత్వ పాఠశాలలు 1,582, ప్రయివేటు స్కూళ్లు 1,094)ను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసేందుకు 11,674 పాఠశాలలు నమోదు (ప్రభుత్వ, జెడ్పీ 6,386, ప్రయివేటు 5,288) చేసుకున్నాయి.
1,408 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ పలు సూచనలు చేసింది. విద్యార్థులు వాతావరణాన్ని, ట్రాఫిక్ ఇతర అనివార్యతలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రానికి ఉదయం 8.30 గంటల కల్లా చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, షార్ప్నర్, ఎరేజర్, జియోమ్యాట్రిక్ పరికరాలను అనుమతిస్తారు. సెల్‌ఫోన్, క్యాలిక్యూలేటర్, స్మార్ట్ వాచ్‌లు లాంటి కమ్యూనికేషన్ పరికరాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
144 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైతే సంప్రదించేందుకు వీలుగా సంబంధిత డీఈవో, తహశీల్దార్, ఎంఈవో ఫోన్ నెంబర్లను డిస్ ప్లే చేయనున్నారు. విద్యార్థుల ఆరోగ్య అవసరాల కోసం ఒక ఏఎన్‌ఎంతో పాటు ఓఆర్‌ఎస్, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు పరీక్షలకు ఆలస్యం కాకుండా సకాలంలో చేరుకునేలా అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఇప్పటికే టీజీఎస్‌ఆర్టీసీని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల పర్యవేక్షణకు వీలుగా ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం (ఫోన్ నెంబర్ 040-2323 0942) ను ఏర్పాటు చేశారు.



