రూ.1650 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్
పార్కు, శ్మశాస వాటిక స్థలాలుగా గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజావసరాలకు సంబంధించిన 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో దాని విలువ రూ.1650 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం కేటాయించినది కాగా, 5 ఎకరాలు శ్మశాన వాటికతోపాటు 4 ఎకరాలు డంప్ యార్దుకు చెందినది ఉంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సెంట్రల్ పార్కు కాలనీలో పార్కు కోసం 2 ఎకరాలు కేటాయించారు. సర్వే నెంబరు 110/1లో 148 ప్లాట్లతో 16 ఎకరాల మేర సెంట్రల్ పార్కు కాలనీ ఫేజ్-1 పేరుతో 1998లో లేఔట్ వేశారు. ఇందులో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా, మున్సిపల్ అధికారులు హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు. కానీ, ఆ స్థలం తమదంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడటం, కాలనీ వాళ్లు అడ్డుకుంటే వారిని బెదిరించడం వంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. దీనిపై హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రెండెకరాలు పార్కు స్థలంగా నిర్ధారించింది. పార్కులో తాత్కాలికంగా వేసిన షెడ్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం ఉదయం తొలగించారు. రెండెకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డు ఏర్పాటు చేశారు.
ప్రగతినగర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి
ప్రగతినగర్‌లోని అంబీర్ చెరువుకు ఆనుకుని ఉన్న 5 ఎకరాల శ్మశానవాటికతోపాటు ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు ఆక్రమణకు గురవుతోందని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో విచారించారు. కూకట్‌పల్లి మండలంలోని బాగామేరి విలేజ్ సర్వే నెంబరు 103లో ఉన్న ఈ భూమిని శ్మశాన వాటికకు, చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించిందిగా నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు 9 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అనంతరం బోర్డులు ఏర్పాటు చేశారు.. ఎన్నో ఫిర్యాదులు అధికారులకు అందజేశామని హైడ్రా ఎంట్రీతో ఈ సమస్య పరిష్కారం అయిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



