పీరియాడిక్ టేబుల్‌ను కంఠస్థం చేసిన 13 ఏళ్ల మనవేంద్రకి ప్రపంచ రికార్డు
అటామిక్, మాస్ నంబర్లు వరుసగా గుర్తించి మెమరీ చాంపియన్ అవార్డు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి : కేవలం 13 ఏళ్ల వయసులోనే శాస్త్రీయ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ కొత్త రికార్డు నెలకొల్పాడు కరీంనగర్‌కు చెందిన కనపర్తి మనవేంద్ర. రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లతో పాటు వాటి అటామిక్ నంబర్, మాస్ నంబర్‌లను కేవలం 40 సెకండ్లలో కంఠస్థంగా చెప్పి ‘అమేజింగ్ మైండ్ ప్రెజెంటేషన్ ఇన్ కెమిస్ట్రీ’ రికార్డు సాధించాడు. ఇది సాధించగలిగిన ఏకైక విద్యార్థిగా అతడు చరిత్రలో నిలిచాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న కనపర్తి మనవేంద్ర వివేకానంద స్కూల్ 9వ తరగతి విద్యార్థి. డాక్టర్ వేణు కుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్ ద్వారా శిక్షణ పొందిన మనవేంద్ర, కేవలం 40 సెకండ్లలో పీరియాడిక్ టేబుల్‌లోని అన్ని మూలకాలను కంఠత చెప్పడమే కాకుండా, వాటి అటామిక్ నెంబర్స్, మాస్ నంబర్లను కూడా గుర్తించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు జాతీయ స్థాయి మెమొరీ ఛాంపియన్‌షిప్‌లలోనూ అతడు ప్రతిభ చాటిన విషయం ట్రైనర్ వేణు కుమార్ గుర్తు చేశారు.
సాధారణంగా విద్యార్థులకు 30 మూలకాలు మాత్రమే తెలుసు కానీ మనవేంద్ర మొత్తం 118 ఎలిమెంట్లతోపాటు వాటి సాంకేతిక సమాచారాన్ని కూడా మేధస్పష్టంగా గుర్తుంచడంలో స్పెషలిస్ట్‌గా నిలిచాడు. ఈ ఘనతకు గుర్తింపుగా ‘సూపర్ మెమొరీ చాంప్’ అవార్డు పొందిన మనవేంద్ర పట్ల తల్లిదండ్రులు మురళి, శృతి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థి ప్రతిభ వెనుక నిలిచిన డాక్టర్ వేణు కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్‌లు తిరుపతి, హరీష్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.