Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి చేరుకోనున్న 12 మంది గల్ఫ్‌ కార్మికులు

రాష్ట్రానికి చేరుకోనున్న 12 మంది గల్ఫ్‌ కార్మికులు

- Advertisement -

మాట నిలుపుకున్న మాజీ మంత్రి హరీశ్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్‌ కార్మికులు వారం రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. అధికారంలో లేకపోయినా మాజీ మంత్రి హరీశ్‌ రావు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఆ కార్మికులకు బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ బాసటగా నిలిచారు. కేసీఆర్‌ ఆదేశాలతో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు హరీశ్‌ రావు అన్ని ప్రయత్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌, ఎంపీ సురేష్‌ రెడ్డి సమన్వయంతో సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కార్మికులను పంపించేందుకు ఒప్పించారు. కంపెనీకి చెల్లించాల్సిన మెత్తాన్ని స్వయంగా భరిస్తూ, విమాన టికెట్లు సైతం ఏర్పాటు చేశారు. విషయం తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న జోర్డాన్‌ లో ఉన్న తెలంగాణ గల్ఫ్‌ కార్మికులు. తమ వారు తిరిగి స్వదేశానికి వస్తుండటంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

గల్ఫ్‌ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు సహా మీడియా దృష్టికి హరీశ్‌ రావు తీసుకువెళ్లారు. జోర్డాన్‌లోని కంపెనీకి పెనాల్టీ చెల్లించేందుకు హరీశ్‌ రావు అంగీకరించారు. దీంతో వారి రాకకు మార్గం సుగమమయింది. మరో వారంలో నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటలకు చిందిన 12 మంది గల్ఫ్‌ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. సుదీర్ఘ కాలపు ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలుసుకోబోతున్నారు.

గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్‌
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే గల్ఫ్‌ కార్మికులను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో వలసలు వాపస్‌ అయితే రేవంత్‌ పాలనలో మళ్లీ వలసలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్తం మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డు అతీగతీ లేదన్నారు. కనీసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా వారి సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. చిక్కుకున్న కార్మికులు తిరిగి రాష్ట్రానికి వస్తుండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -