Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆయిల్‌ పామ్‌ సాగుకు 12 లక్షల ఎకరాలు

ఆయిల్‌ పామ్‌ సాగుకు 12 లక్షల ఎకరాలు

- Advertisement -

ఏటా రెండు లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంతో ముందుకు : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా 12 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందనీ, ప్రస్తుతం 73,696 మంది రైతులు 2.74 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏటా కొత్తగా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాము సాగు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తామనీ, అలా చేస్తే నాలుగేండ్లలో పదిలక్షల ఎకరాలకు సాగు పెరిగి దేశంలోనే ఆయిల్‌ ఫాము ఉత్పతిలో తెలంగాణ తొలిస్థానంలోకి వస్తుందని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల లక్ష్యం నిర్ధేశించగా, ఇప్పటివరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగయ్యిందనీ, మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉందని చెప్పారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గత ఐదేండ్లలో కేవలం 2.28 లక్షల ఎకరాల్లోనే సాగు కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్‌ పామ్‌ విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్కువ పురోగతి ఉన్న జిల్లాలుగా వరంగల్‌, నారాయణపేట, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, గద్వాల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ఆదిలాబా ద్‌లను గుర్తించినట్టు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆయా కంపెనీలు లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి కంపెనీ కూడా తమ పరిధిలోని జిల్లాల్లో సరిపడా సిబ్బందిని నియమించుకుని రైతులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని సూచించారు. తోటల యాజమా న్యంలో నీటి వినియోగం, ఎరువుల పంపిణీ, అంతర పంటలు, కలుపు నివారణ వంటి అంశాల పై పూర్తి దృష్టి సారించాలని ఆదేశించారు. గెలల దిగుబడులు తగ్గకుండా పర్యవేక్షణ చేయడం, విజయవంతమైన రైతుల అనుభవాలను కొత్త రైతుల ప్రోత్సాహానికి వినియోగించడం అవసరమని సూచించారు. అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను దిగుమతి చేసుకోవాలన్నారు. ప్రతి కంపెనీ తన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలను ఏర్పాటు చేసుకుని రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని ఆదేశించారు. కంపెనీలు తమ పరిధిలో రైతు సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాల ని, రైతు వేదికల కార్యక్రమాల్లో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొని రైతులతో చర్చించాలని సూచించారు. వచ్చే ఏడాదికల్లా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ, ఆయిల్‌ పామ్‌ విస్తరణలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌, సహకార శాఖలు సమన్వయం తో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీల పురోగతిపై మంత్రి సమీక్షిస్తూ, త్వరలో ప్రారంభం కానున్న ఫ్యాక్టరీల వివరాలు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం ద్వారా రైతుల ఆదాయ వనరులు పెంచడం, దిగుమ తులపై ఆధారాన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నొక్కి చెప్పారు. సమీక్షలో ఉద్యానశాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఆయిల్‌ పామ్‌ కంపెనీల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -