– ఎస్సారెస్పీలోకి నీటి విడుదల
– పాల్గొన్న ఇరు రాష్ట్రాల
నీటిపారుదల శాఖ అధికారులు
నవతెలంగాణ-మెండోర
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రాంతంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం ఎత్తారు. ప్రతి సంవత్సరం జులై 1న మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు బాబ్లీ గేట్లు ఎత్తి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) ప్రాజెక్టులోకి నీటిని వదులుతారు. తిరిగి అక్టోబర్ 29న గేట్లు మూసేస్తారు. మంగళవారం ఉదయం రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులు బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం 0.35 టీఎంసీల నీరు నిలకడగా ఉంది. ఎస్సారెస్పీలోకి పూర్తి స్థాయిలో నీరు చేరుతోంది. ఎస్సారెస్పీ సూపరింటెండెంట్ ఇంజినీర్ టి.శ్రీనివాసరావు గుప్త, నాందేడ్ సిడబ్ల్యూసి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్, నాందేడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి.ఆర్.బాన్సోద్, ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.చక్రపాణి, ఎస్సారెస్పీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES