– 26 నేరాల్లో 200కుపైగా మేకలు దొంగిలించిన ముఠా సభ్యులు
– రూ.2.46లక్షల నగదు, 22 గొర్రెలు, ఎనిమిది కార్లు స్వాధీనం :ఎస్పీ శరత్‌చంద్రపవార్ వివరాలు వెల్లడి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామాల్లో పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయాల్లో కార్లలో వచ్చి మేకలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసినట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శాలిగౌరారం పోలీసులు సోమవారం బైరవోనిబండ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో.. దొంగలు షిఫ్ట్ డిజైర్ కారులో తప్పించుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో ముగ్గురు పురుషులు, మహిళ ఉన్నారు. వారిని పోలీసుల వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో చెక్ చేయగా.. వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. సంపంగి వెంకటేష్, వెంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్ కుమార్, ఏ.కోటిపైన గతంలో నల్లగొండ రూరల్ పీఎస్, నల్లగొండ-2 టౌన్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్‌పల్లి, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పీఎస్‌లలో మేకల దొంగతనాల కేసులు ఉన్నాయి. వీరు గతంలో జైలుకు వెళ్లొచ్చారు. వారికి పరిచయం ఉన్న వారందరూ కలిసి నాలుగు గ్రూపులుగా ఏర్పడి ఖరీదైన కార్లలో వచ్చి పగటి పూట రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయాల్లో మేకలను కార్లలో వేసుకొని పోతున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 15 చోట్ల, రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకలు, గొర్రెల దొంగతనాలు చేశారు. మొత్తం 16మందిని అరెస్టు చేశారు. 26 నేరాలకు సంబంధించి 200కుపైగా మేకలను దొంగతనం చేశారు. రూ.2లక్షలా 46వేలు, 2 లక్షలా 75వేల విలువ గల 22 గొర్రెలు, 47 లక్షల విలువ గల ఎనిమిది కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రశంసా పత్రాలు, రివార్డులు
నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి పర్యవేక్షణలో దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన నల్లగొండ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, ఎం.నాగభూషణ్, శాలిగౌరారం ఇన్‌స్పెక్టర్ కె.కొండల్ రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె.నాగరాజు, ఎస్‌ఐలు శివకుమార్, విజరు కుమార్, రవి, రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి, వహీద్ పాషా, సూఫీయాన్ అలీ, రామ్ ప్రసాద్, నాగరాజు, సిసిఎస్ కానిస్టేబుల్ అశ్రార్, మహేశ్, వెంకట్ రామ్, సాయిని ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేసి రివార్డు ప్రకటించారు