– సీఎం, సీఎస్‌కు ఉద్యోగ జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్లుగా ఎంపికైన 16 మంది ఐఏఎస్ (కన్ఫర్డ్)గా పదోన్నతి పొందడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఉద్యోగ జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఏనాడూ ఏకకాలంలో 16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి రాలేదని పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో గ్రూప్-2 అధికారులకు ఐఏఎస్ (కన్ఫర్డ్)లుగా పదోన్నతి కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును లచ్చిరెడ్డి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులతో బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ప్రభుత్వ పెద్దల సహకారం, కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన 16 మందికి లచ్చిరెడ్డి, ఇతర జేఏసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎస్ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి కోరారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బిల్లులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అర్హులైన తహశీల్దార్లు ఉన్నప్పటికీ వారికి పదోన్నతి కల్పించడం లేదని గుర్తు చేశారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల వివరాలను కూడా సీఎస్‌కు వివరించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి, రెండో త్రైమాసికాల కోసం తహశీల్దార్లకు నెలకు రూ.33 వేల చొప్పున అద్దె వాహనాల ఖర్చులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. దాని ప్రకారం తహశీల్దార్లు ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించినప్పటికీ క్లెయిమ్ కాలానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు అవసరమని పేర్కొంటూ ఆ బిల్లులను తిరస్కరించారని వివరించారు. తహశీల్దార్లకు కేటాయించిన అద్దె వాహనాల ఖర్చులను క్లెయిమ్ చేసుకునేందుకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్యామిలీ పెన్షన్ ఉద్యోగి మరణించిన తేది నుంచి మంజూరు చేయాలని సూచించారు. ఇదే కాకుండా సీపీఎస్ ఉద్యోగులు చెల్లించే 10 శాతం సీపీఎస్ కాంట్రిబూషన్‌తోపాటు ప్రభుత్వం చెల్లించే 10 శాతం సీపీఎస్ కాంట్రిబూషన్ సకాలంలో చెల్లించాలని తెలిపారు. కరువు భత్యం వాయుదాల్లో కాకుండా ఏక మొత్తంగా చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 10 సీపీఎస్ కాంట్రిబూషన్‌ను కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 14 శాతానికి పెంచాలని తెలిపారు. రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించారని గుర్తు చేశారు. కానీ నేటికి వారి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయకపోగా, ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. వారి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు ఎస్ రాములు, రమేష్ పాక, దర్శన్‌గౌడ్, రజిని, కుమారస్వామి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
16 మందికి ఐఏఎస్‌లుగా పదోన్నతి చరిత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



