ఆశన్న సైతం..
కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా ప్రకటన
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో 170మంది మావోయిస్టులతో పాటు అగ్రనేత ఆశన్న కూడా లొంగిపోయినట్టు కేంద్ర హౌం మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రెండు ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రభావం తగ్గిపోయినట్టు తెలిపారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది, మహారాష్ట్రలో 61మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. రెండ్రోజుల్లో మొత్తంగా 258మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. వీరంతా హింసా మార్గం వీడి రాజ్యాంగంపై విశ్వాసం చూపటాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఆయుధాలతో పోరాడేవారికి భద్రతాదళాలే తగిన సమాధానం చెబుతాయన్నారు. జనజీవన స్రవంతిలో కలవాలని తుపాకీతో పోరాటం చేస్తున్న వారికి మరోసారి పిలుపునిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల్ని తుదముట్టించటానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్టు అమిత్ షా తేల్చి చెప్పారు.
లొంగిపోయిన అగ్రనేత
ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆశన్న ఐటీఐ, పాలిటెక్నిక్ చదివారు. 1991లో పీపుల్స్‌వార్ పార్టీలో చేరిన ఆయన, 1999లో పీపుల్స్‌వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్‌కు ఆయనే నేతృత్వం వహించినట్టు ప్రచారంలో ఉంది. 2000లో ఉమ్మడి ఏపీ హౌంమంత్రి ఎ.మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును మందుపాతర తో పేల్చేసి చంపేయడం, 2003లో అలిపిరిలో అప్పటి సీఎం చంద్రబాబు కాన్వారును క్లెమోర్‌మైన్‌తో పేల్చి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడిన దుశ్చర్యలతో ఆశన్న పేరు విస్తృతంగా ప్రచారమైంది.