Monday, May 26, 2025
Homeరాష్ట్రీయంఈసెట్‌లో17,768 మంది ఉత్తీర్ణత

ఈసెట్‌లో17,768 మంది ఉత్తీర్ణత

- Advertisement -

అర్హత పొందిన వారిలో అమ్మాయిలే అధికం
ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో బీటెక్‌, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ద్వితీయ సంవత్సరంలో లాటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈసెట్‌ రాతపరీక్ష ఫలితాలను ఆదివారం హైదరాబాద్‌ ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్‌ మొలుగారం విడుదల చేశారు. ఈనెల 12న ఈసెట్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 19,672 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 18,928 (96.22 శాతం) మంది హాజరయ్యారు. వారిలో 17,768 (93.87 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 11,835 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 10,972 (92.71 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 7,093 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 6,796 (95.81 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఈసెట్‌ ఫలితాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 3.1 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 11 కోర్సుల్లో ప్రవేశాలకు ఈసెట్‌ రాతపరీక్షను నిర్వహించారు. అత్యధికంగా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) విభాగానికి 5,336 మంది దరఖాస్తు చేయగా, 5,138 మంది పరీక్ష రాశారు. వారిలో 4,774 (92.92 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కి 4,879 మంది దరఖాస్తు చేస్తే, 4,728 మంది పరీక్ష రాశారు. వారిలో 4,522 (95.64 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) విభాగానికి 4,201 మంది దరఖాస్తు చేస్తే, 4,053 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,719 (91.76 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సివిల్‌ ఇంజినీరింగ్‌కు 2,578 మంది దరఖాస్తు చేయగా, 2,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,389 (96.45 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు 2,035 మంది దరఖాస్తు చేస్తే, 1,949 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వారిలో 1,813 (93.02 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. అత్యల్పంగా బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుకు 30 మంది దరఖాస్తు చేయగా, పది మంది పరీక్ష రాశారు. వందశాతం ఉత్తీర్ణత పొందారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ కుమార్‌ మొలుగారం, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, ఓయూ రిజిస్ట్రార్‌ నరేష్‌రెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ పి చంద్రశేఖర్‌, ఎస్‌బీటెట్‌ ఇన్‌చార్జీ బి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
లీజు క్వార్టర్లపై సమీక్షిస్తాం : కుమార్‌
ఓయూలో రెండు క్వార్టర్లను గతంలో లీజుకిచ్చారనీ, తాను ఇవ్వలేదని వీసీ ఎం కుమార్‌ చెప్పారు. వాటిపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఏటా ఓయూ స్నాతకోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. తాను వచ్చాక ఫీజులను పెంచలేదన్నారు. ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో వచ్చేనెల 15 నుంచి ఈసెట్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -