Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలో మరో 18 దత్తత కేంద్రాలు

తెలంగాణలో మరో 18 దత్తత కేంద్రాలు

- Advertisement -

– రెండు బాలల సంరక్షణ కేంద్రాలు
– గ్రీన్‌సిగల్‌ ఇచ్చిన రాష్ట్ర సర్కారు : ఫైల్‌పై
సంతకం చేసిన మంత్రి డాక్టర్‌ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో మరో 18 ప్రత్యేక దత్తత కేంద్రాలు, రెండు బాలల సంరక్షణ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి కాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ (సీతక్క) ఆ ఫైల్‌పై శుక్రవారం సంతకం చేశారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ కేంద్రాల ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ ప్రారంభం కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అనాథలు, తల్లిదండ్రులు వదిలి వేసిన పిల్లలను దత్తత కేంద్రాల్లో సంరక్షిస్తూ వారికి అన్ని అవసరాలను అందించడంతో పాటు, నిబంధనల ప్రకారం దత్తత ఇచ్చే ప్రక్రియను సర్కారు చేపడుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 జిల్లాల్లో 17 దత్తత కేంద్రాలున్నాయి. వాటికి అదనంగా 18 కొత్త కేంద్రాల ఏర్పాటుతో మొత్తం దత్తత కేంద్రాల సంఖ్య 35కి చేరనుంది. పిల్లల అక్రమ విక్రయాలు, అనధికార దత్తతలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. దత్తతను చట్టం బద్ధంగా తీసుకునే వెసులుబాటును కల్పించేందుకు ఈ దత్తత కేంద్రాలు దోహదపడనున్నాయి. ఈ ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల నిర్వహణ, పిల్లల బాగోగుల కోసం ఏటా రూ. 5.44 కోట్లు ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసింది. అందులో 60 శాతం (రూ. 3.26 కోట్లు) కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం (రూ. 2.17 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ కేంద్రాల్లో సేవలందించేందుకు 228 మంది సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించనున్నారు. ముఖ్యమంత్రి సంతకం అనంతరం ఈ ప్రాజెక్టు అమలు ప్రారంభమవుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని నిరాశ్రయ పిల్లల భద్రతకు, దత్తత ప్రక్రియ పారదర్శకతకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -