నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో యజమానులు వదిలివెళ్లిన (అబాండెడ్) మొత్తం 195 వాహనాలు ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో భద్రపరిచి ఉంచినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలు చాలా కాలంగా యజమానులు లేకుండా నిల్వ ఉండటంతో ప్రభుత్వ ఆస్తిగా మారే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్ – 1861 లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను చట్టబద్ధమైన విధానంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ వెల్లడించారు. యాజమాన్య హక్కు కలిగిన వారికి ఇది చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ తేదీ 26.02.2026 నుండి 6 నెలల లోపు సంబంధిత ఆధారాలతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ విభాగంలో సరైన వాహన పత్రాలను సమర్పించి తమ వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
గడువు అనంతరం ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించబడవని, చట్ట ప్రకారం వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లలో వదిలివేయబడిన 195 వాహనాల పూర్తి జాబితా జిల్లా పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. యాజమాన్య హక్కు కలిగిన వారు జాబితాను పరిశీలించి, అవసరమైన పత్రాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. వాహనాలకు సంబంధించిన వివరాల కోసం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఏ. నవీన్ ( ఎంటిఓ ) ను సెల్ నంబర్లు 8712686111 లేదా 8712525970 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. జాబితాలో తమ వాహనం ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించి, సంబంధిత ఆధారాలతో వెంటనే అధికారులను సంప్రదించి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆయన ప్రకటనలు కోరారు.



