Monday, April 13, 2026
E-PAPER
Homeజాతీయంయూపీలో 2.04 కోట్ల ఓట్లు తొలగింపు

యూపీలో 2.04 కోట్ల ఓట్లు తొలగింపు

- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (సర్‌.2.0) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో 2.04 కోట్ల పేర్లు తొలగించడంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13.39 కోట్లకు తగ్గింది. ఇది సవరింపు ప్రక్రియకు ముందు ఉన్న 15.44 కోట్లతో పోలిస్తే సుమారు 13.24 శాతం తగ్గుదలగా నమోదైంది.
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన సర్‌ రెండో దశలో మొత్తం 5.38 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ఇది మొత్తం ఓటర్లలో 10.56 శాతం తగ్గుదలగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోనే అత్యధికంగా 2.04 కోట్ల తొలగింపులు జరగగా, పశ్చిమ బెంగాల్‌లో సుమారు 91 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. శాతం పరంగా చూస్తే అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లో 16.9 శాతం తగ్గుదలతో అగ్రస్థానం ఉండగా, ఉత్తర ప్రదేశ్‌ , గుజరాత్‌ రాష్ట్రాల్లో సుమారు 13 శాతం తగ్గుదల నమోదైంది. ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వరుసగా 12 శాతం, 11.5 శాతం తొలగింపులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇది 11.7 శాతం కాగా, కేరళలో కేవలం 2.7 శాతం మాత్రమే తగ్గుదల కనిపించింది.
సర్‌ 2.0 ప్రకారం ఈ తొలగింపులకు ప్రధాన కారణాలుగా 1.46 కోట్ల మంది ఓటర్లు మరణించినట్టు గుర్తించారు. 4.6 కోట్లకు పైగా నివాసం మారారు. 44 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో నమోదు కావడం వంటి అంశాలు పేర్కొన్నారు. తొలగింపుల్లో అధిక భాగం పట్టణ ప్రాంతాల్లోనే నమోదవగా, గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన (ఎఎస్డీ) వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్‌ తుది జాబితాలో ప్రస్తుతం 13.39 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 7.3 కోట్ల మంది పురుషులు, 6.09 కోట్ల మంది మహిళలు, 4,206 మంది తతీయ లింగ ఓటర్లు ఉన్నారు. అలాగే 18ు19 ఏండ్ల వయస్సు గల 17 లక్షల కొత్త ఓటర్లు జాబితాలో చేరారు. జనవరిలో విడుదలైన ముసాయిదా జాబితాలో 2.89 కోట్ల పేర్లు తొలగించడంతో భారీ తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదుల మేరకు 84.28 లక్షల పేర్లు తిరిగి చేర్చడంతో తుది తగ్గుదల కొంత తగ్గింది.
అయితే సాంకేతిక సమస్యలు కూడా వెలుగుచూశాయి. సుమారు 1.04 కోట్ల మంది ఓటర్ల వివరాలు పాత జాబితాలతో సరిపోలకపోవడం, 2.22 కోట్ల కేసుల్లో పత్రాల తనిఖీలో తార్కిక వ్యత్యాసాలు గుర్తించడం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 2002 నాటి జాబితాలతో అనుసంధానం లేకపోవడం వల్ల సుమారు 27 లక్షల మంది ఓటర్లు అగమ్యగోచరంగా ఉన్నారు.
ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. రెండో దశపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో మైక్రో అబ్జర్వర్లు, ధవీకరణ ప్రక్రియలతో ఇది మరింత సంక్లిష్టమైంది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రక్రియ పూర్తి చేయడంలో ఆలస్యం జరిగి, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, విచారణలు పూర్తి కాకముందే గడువులు నాలుగు సార్లు పొడిగించాల్సి వచ్చింది. మొత్తం మీద, భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపులు, సాంకేతిక లోపాలు, న్యాయపరమైన వివాదాలు ఎన్నికల ప్రక్రియపై చర్చలకు దారితీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -