తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ రౌండ్‌టేబుల్‌లో వక్తల డిమాండ్
సర్కారు బడుల్లో విద్యార్థులు తగ్గడంపై ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ 2026-27లో విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం హైరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి’ అనే అంశంపై ఆ సంఘం ఆధ్వర్యం లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాపరిరక్షణ కమిటీ అధ్యక్షులు కె చక్రధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించిన 12 ఏండ్లలో గతంలో బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్‌లో నిధులను తగ్గించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని అన్నారు. వచ్చే ఐదేండ్లలో విద్యార్థుల సంఖ్య వేగంగా పడిపోయి ప్రభుత్వ పాఠశాలల్లో వారు ఒక్క శాతం కూడా మిగలబోరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ మాట్లాడుతూ రాజస్థాన్, బీహార్ కంటే రాష్ట్రంలో విద్యా బడ్జెట్ తక్కువగా ఉందన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్ మాట్లాడుతూ ఓయూలో 1,267 ప్రొఫెసర్లు ఉండాలనీ, 936 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలనే డిమాండ్‌ను సమర్థిస్తున్నానని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎంవీఎఫ్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు ఆర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులున్నా కూడా ఉపాధ్యాయులను నియమించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రొఫెసర్ శివారెడ్డి మాట్లాడుతూ విద్యా బడ్జెట్ తక్కువగా ఉండడం వల్ల అవసరం ఉన్నన్ని గదులు లేని పాఠశాలలు 13 వేల వరకు ఉన్నాయని అన్నారు. ప్రహరీ గోడలు లేనివి 13 వేల వరకు ఉన్నాయని చెప్పారు. 20 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సగటున ఇద్దరే ఉపాధ్యాయులున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విద్య అందడం అసాధ్యమని చెప్పారు.
ప్రొఫెసర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ 2024 అసర్ నివేదిక ప్రకారం ఎనిమిదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకం చదవలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అత్యంత వేగంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి స్టాలిన్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి రఘు నందన్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నె బోయిన తిరుపతి, అదనపు ప్రధాన కార్యదర్శి రవీందర్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతి నిధులు వై అశోక్ కుమార్, ఎం రఘుశంకర్‌రెడ్డి, కె రవిచందర్, ప్రొఫెసర్ కె లక్ష్మీ నారాయణలు, టీయూసీఐ నాయకులు కె ప్రదీప్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి మహేష్ గురుకుల ఉపాధ్యాయ సంఘం నాయకులు సదానందం తదితరులు పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



