Thursday, February 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి2025-26 ''ఎకనామిక్‌ సర్వే''-అభూత కల్పనల వ్యవసాయ రంగం

2025-26 ”ఎకనామిక్‌ సర్వే”-అభూత కల్పనల వ్యవసాయ రంగం

- Advertisement -

”రాజు వెడలె రవితేజము లలరగ” అని నాటకాల్లో చెప్పే స్తోత్ర పథబందకం కన్నా అత్యంత పొగడ్తలతో, అభూత కల్పనలతో, వాస్తవాలను మరుగుపరిచే విధంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జనవరి 29న పార్లమెంట్‌లో 2025-26 ”ఎకనామిక్‌ సర్వే” నివేదికను ప్రవేశపెట్టారు. అందులో ఆరవ అధ్యాయంలో వ్యవసాయ రంగం సమీక్ష వివరించబడింది. వ్యవసాయ రంగం వృద్ధిరేటు 2024-25లో 4.6శాతానికి పెరిగినట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.77 కోట్ల టన్నులకు చేరుకున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి 2022-23లో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 6.3గా ఉంది. 2023-24లో అది 2.7కు తగ్గి, మరల 2024-25లో పెరిగింది.

ఆర్థిక సర్వే ప్రకారం 2017-18 నుండి వ్యవసాయ రంగం ఉత్పత్తి, ఉత్పాధకత ఎగుడు-దిగుడులకు లోనవుతూనే ఉంది. అంబరిల్లా పథకం కింద ఎనిమిది శాఖల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి జరిగినట్లు నివేదించారు. అలాగే, పిఎమ్‌ క్రిషీ సించాయి యోజన (ఎఐబిపి ఇరిగేషన్‌) ద్వారా నీటి వనరులు దేశంలో 41.7శాతం నుండి 55.8శాతానికి సాగు విస్తీర్ణం పెరిగినట్లు నివేదించారు. కానీ, కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి 2021-22 నుండి నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కోత పెట్టారు. క్రిష్ణోన్నతి యోజన (2వ హరిత విప్లవం), పంటల వైవిధ్యం, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి, ప్రధానమంత్రి కిసాన్‌ సమాన్‌ నిధి (సంవత్సరానికి రూ.6వేల సబ్సిడీ పథకం), ఫర్‌ డ్రాప్‌ మోర్‌ గ్రాప్‌ పథకాల ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉత్పాధకత పెరిగినట్లు చెప్పారు.

ప్రపంచంలో రెండవ ర్యాంకులో కూరగాయలు, పండ్లు, ఆలుగడ్డలు (ప్రపంచ ఉత్పత్తిలో 13శాతం) ఉత్పత్తి చేస్తున్నట్లు, ఉల్లి ప్రపంచ ఉత్పత్తిలో 25శాతానికి పెరిగినట్లు నివేదికలో వివరించారు. ఆర్థిక మంత్రి వివరించినట్లు వ్యవసాయ రంగం ఇంత అభివృద్ధి జరిగితే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నాము? 2024-25లో చిరుధాన్యాల ఉప ఉత్పత్తులు రూ.5,450 కోట్లు, జీడిపప్పు రూ.14,083 కోట్లు, ముడి పత్తి రూ.10,326 కోట్లు, వంటనూనెలు రూ.1,46,729 కోట్లు, పప్పుధాన్యాలు, పంచదార, పాల ఉప ఉత్పత్తులు, సోయా ఉప ఉత్పత్తులు వేల కోట్లలో దిగుమతులయ్యాయి.

ఎగుమతులు తగ్గి..దిగుమతులు పెరిగి..
2014-15లో మొత్తం ఎగుమతి – దిగుమతుల లోటు రూ.8,40,739 కోట్లు కాగా 2024-25లో రూ.21,71, 761 కోట్లకు లోటు పెరిగింది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సి రావడం వల్ల, దేశంలోని ఎఫ్‌డిఎలు (విదేశీ సంస్థాగత పెట్టుబడులు) తరలిపోవడంతో డాలర్ల కొరత ఏర్పడింది. డాలర్ల కొనుగోలు పై ఒత్తిడి రావడం వల్ల రూపాయి విలువ డాలర్లతో మారకంలో ఒక డాలరుకు రూ.92కు చేరింది. మరికొన్నేళ్లలో రూ.100కు చేరే అవకాశం ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం అంటే, పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఉత్పత్తి రంగం పెరగడంలేదని అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం దేశ జనాభా 146 కోట్లతో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. కానీ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 30కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న చైనా 82 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా, 28కోట్ల ఎకరాల సాగుతో 63కోట్ల టన్నుల ఆహార దాన్యాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 33-34 కోట్ల ఎకరాల సాగులో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం 35కోట్ల టన్నుల ఆహార దాన్యాలతో 3వ స్థానంలో ఉంది. పై దేశాలతో పోల్చినప్పుడు హెక్టారు ఉత్పాదకత చైనాలో 8 టన్నులు, అమెరికాలో ఆరు టన్నులు కాగా భారతదేశంలో 2.6 టన్నులుగా ఉంది.

1991 నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలు, 1995లో డబ్య్లూటిఓ షరతుల కారణంగా వ్యవసాయ రాయితీల్లో కోతలు పడ్డాయి.2000ల సంవత్సరంలో విదేశీ కార్పొరేట్‌ సంస్థలు వ్యవసాయ రంగంలో ప్రవేశించి దేశీయ పరిశోధనలను కుదించాయి. ఉత్పాదకత, ఉత్పత్తి జనాభా పెరుగుదలకు అనుగుణంగా పెరగలేదు. మోన్‌సాంటో, డూ-పాంట్‌, కార్గిల్‌, సిన్‌జంటా, బేయర్‌ లాంటి సంస్థలతో పాటు దేశీయ కార్పొరేట్‌ సంస్థలు, అదానీ, అంబానీల కంపెనీలు, ఐటిసీ, ఎల్‌అండ్‌టి, మహికో లాంటి సంస్థలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి ఎనభై శాతం విత్తన రంగంపై ఆధిపత్యం కలిగి ఉన్నాయి. దేశీయ పరిశోధన కేంద్రాల్లో పరిశోధనలు జరగకుండా, శాస్త్రవేత్తలను, నిధులను కేటాయించకుండా తగ్గించాయి. విదేశీ విత్తన టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ ”వాతావరణ పరిస్థితులకు” సరిపోక ఉత్పాదకత పెరగడం లేదు. జి-7 దేశాలు, అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్‌ లాంటి దేశాలనుండి దిగుమతులు సాగుతున్నాయి. వారికి ఆటంకం లేకుండా దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతియడానికి సరళీకరణ విధానాలను అమలు చేయాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. వారి ఒత్తిడికి లొంగి వ్యవసాయ రంగాన్ని విదేశీ, దేశీ కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టారు.

జనాభా పెరుగుదల కారణంగా సాగు భూమి విస్తీర్ణం తగ్గుతున్న సందర్భంలో హెక్టారు ఉత్ఫాదకతను పెంచి దేశ అవసరాలను తీర్చాలి. హెక్టారుకు కనీసం ఐదు టన్నుల ఉత్పత్తుల వరకైనా చేరుకునే విధంగా పరిశోధనలను అభివృద్ధి చేయాలి. హరిత విప్లవ కాలంలో (1965-85) కాలంలో నాటి ఉష్ణోగ్రత 33 డ్రిగ్రీలు కాగా, నేడు యాభై డిగ్రీలకు పెరిగింది. ఈ వాతావరణానికి అను గుణంగా విత్తనాల పరిశోధనలు జరగాలి. ఎకనామిక్‌ సర్వే ప్రకారం 6.85 లక్షల గ్రామాల్లో 1,649.26 లక్షల క్వింటాళ్ల క్వాలిటీ విత్తనాలు 2.58కోట్ల మంది రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. దేశం నుండి ఎఫ్‌-1, హైబ్రీడ్‌, అధికోత్పత్తి వంగడాల విత్తనాలను 20 దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. 18వేల కోట్ల విత్తనవ్యాపారం సాగుతున్నది. కానీ, దేశీయ రైతులకు సర్టిఫైడ్‌ విత్తనాలు, తక్కువ నాణ్యతగల విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దేశీయ అవసరాలకు 160.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. నాణ్యతగల విత్తనాలను సరఫరా చేయకపోవడం వల్ల రైతులు యేటా దిగుబడులు నష్టపోతున్నారు.

ఇదేనా..ఆత్మనిర్భరత?
పప్పుల, వంటనూనెల ఉత్పత్తిలో ”ఆత్మనిర్భర్‌ భారత్‌” (స్వయం పోషకత్వం) చేస్తామని 2025 అక్టోబర్‌ ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తీర్ణం మాత్రం దేశంలో ఎనిమిది లక్షల ఎకరాలకు మించలేదు. ప్రభుత్వం ప్రకటించిన టన్ను ఆయిల్‌ ఫామ్‌ పండ్లకు రూ.20వేలు లభించకపోవడంతో చాలామంది రైతులు ఆయిల్‌ఫామ్‌ తోటలను తీసివేస్తున్నారు. వేరుశనగతో పాటు తొమ్మిది రకాల నూనెగింజల పంటలు విస్తీర్ణం యేటా తగ్గుతున్నది. ముఖ్యంగా వ్యవసాయానికి పంట రుణాలు అత్యంత కీలకం రిజర్వుబ్యాంకు అదేశాల ప్రకారం బ్యాంకుల వ్యాపార ధనంలో నలభై శాతం వ్యవసాయ రంగానికి కేటాయించాలి. అందులో 18శాతం స్వల్పకాల, దీర్ఘకాలిక పంటరుణాలు ఇవ్వాలి. జిల్లా టెక్నికల్‌ అడ్వయిజరీ బోర్డ్‌ రికమండేషన్‌ ప్రకారం ”స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌” ప్రకారం రుణ సౌకర్యం కల్పించాలి.

ఆర్థిక సర్వే ప్రకారం రూ.15.93 లక్షల కోట్లు స్వల్పకాలిక రుణం, 12.77శాతం దీర్ఘకాలిక రుణం ఇచ్చినట్లు వివరించారు. 2025లో రూ.27.5లక్షల కోట్లు పంట రుణాలు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు 7.72 కోట్ల అకౌంట్స్‌కు 10.20 లక్షల కోట్లు మార్చి 2025 వరకు పంపిణీ చేసినట్లు వివరించారు. వడ్డీ మాఫీ పథకం కింద 2015 నుండి 2026 వరకు రూ.1.77లక్షల కోట్లు చెల్లించినట్లు ”కిసాన్‌ రిన్‌ పోర్టల్‌” ద్వారా వివరించారు. 30 షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, 42 రూరల్‌ రీజనల్‌ బ్యాంకు, 20 రాష్ట్ర సహకార బ్యాంకులు, 356 జిల్లాల సహకార బ్యాంకులు రుణాలిస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి బ్యాంకుల వ్యాపార ధనం ప్రకారం 40 లక్షల కోట్లు పంట రుణాలివ్వాలి. కానీ, బ్యాంకులు రుణ సౌకర్యం కల్పించకపోవడంతో ప్రయివేటు రుణాలపై ఆధారపడి ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. మార్కెటింగ్‌ అభివృద్ధి చేయడం ద్వారా, ఎఫ్‌పిఓల నిర్వాహణ ద్వారా రైతులకు గిట్టుబాటుధర కలిగించినట్లు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్ధతు ధరలు నిర్ణయిస్తున్నది. కానీ, ఉత్పత్తి ధరపై యాభై శాతం ప్రకటించని కేంద్రం, ఉత్పత్తి ధరను నిర్ణయించడంలో అశాస్త్రీయ విధానం కొనసాగుతున్నది. యేటా రూ.18లక్షల కోట్ల వ్యాపారం మార్కెట్ల ద్వారా సాగుతుండగా రైతులు కనీస మద్ధతు ధర లభించక రూ.4లక్షల కోట్లు నష్టపోతున్నట్లు అశోక్‌ గులాటి ఆర్థికవేత్త ప్రకటించారు. 2027-28 నాటికి పదివేల ఎఫ్‌పిఓలను ఏర్పాటు చేస్తామని రిజిస్టర్‌ చేశారు. నిర్మాణం చేసిన ఎఫ్‌పిఓలకు నాబార్డ్‌, సన్నకారు రైతుల సహాయ కేంద్రం రుణాలు సబ్సిడీలివ్వడానికి ఇబ్బందులు పెట్టడంతో రిజిస్టర్‌ అయిన ఎఫ్‌పిఓలు పనిచేయకుండా ఉన్నాయి. ఇ-నాం మార్కెట్‌ (ఎలక్ట్రాలనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) అమలులోకి తెచ్చిన 2016 తర్వాత మూడేళ్లకు అది విఫలప్రయోగంగా ప్రధాని మోడీ పార్లమెంట్‌లో అంగీకరించారు. ఎపిఎమ్‌సి యాక్ట్‌ను సవరించి కార్పొరేట్‌ సంస్థలకు మార్కెట్‌లను కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేసింది. లాభాల వేటలో ఉన్న కార్పొరేట్లు రైతుల ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ చేసి పెట్టు బడిపై రెట్టింపు లాభాలు సంపాదిస్తున్నారు.

పంటల బీమా కంపెనీలకే లాభం
పంటల బీమా ఫార్స్‌గా తయారయింది. బీమా కంపెనీలకు యేటా రూ.5వేల కోట్ల వరకు ముట్టచెబుతున్నారు. రాష్ట్రంలో 24.57 కోట్ల కమతాలుండగా 4.5-5 కోట్ల మందికే బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో మూడు కోట్ల మందికి మాత్రమే క్లెయిమ్‌లు వస్తున్నాయి. 8 రాష్ట్రాలు ఫసలు బీమా నుండి బయటకి వచ్చాయి. రెండు రాష్ట్రాలు స్వంత బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రకృతి వైపరిత్యాల వల్ల దేశంలో యేటా ఐదు కోట్ల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. 15వ ఆర్థిక కమిషన్‌ రూ.1.32 లక్షల కోట్లు మాత్రమే కేటాయించింది. జరుగుతున్న నష్టంలో ఈ పరిహారం పదిశాతం కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ల ద్వారా ఎలాంటి పరిహారాలు ఇవ్వడం లేదు.

కుదేలవుతున్న వ్యవసాయం
వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచడానికి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు 2014-15 నుండి 2026 వరకు 25,689 కేంద్రాలను పెంచినట్లు చెప్పారు. 2025-26 మధ్య 558 కేంద్రాలను పెంచి ఎఫ్‌పిఓ, పిఎసిఎస్‌, ఎస్‌హెచ్‌జిల ద్వారా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి దేశంలో సన్న, చిన్నకారు రైతులు (ఐదెకరాల లోపు కలిగినవారు) 12.37 కోట్ల మంది ఉన్నారు. వీరు మొత్తం రైతులలో 85శాతం ఉన్నారు. వీరికి కావాల్సిన చిన్న యంత్రాలను ఉత్పత్తి చేయకపోవడంతో, భారీ యంత్రాలను వినియోగించుకోలేక పోతున్నారు. అమెరికాలో 92శాతం, చైనాలో 57శాతం యాంత్రీకరణ ఉండగా భారతదేశంలో 22శాతం మాత్రమే యాంత్రీకరణ ఉంది. గ్రామాల్లో కూలీల కొరత వల్ల పంటల విధానాన్ని మార్చివేస్తున్నారు. టెక్నాలజీ సపోర్ట్‌ తగ్గడం, అడవి జంతువుల వల్ల జరుగుతున్న నష్టాలు, తదితర సమస్యల వల్ల వ్యవసాయ రంగం దినదినం నష్టదాయకం కావడంతో గౌరవ ప్రదమైన వ్యవసాయం నేడు వదులుకునే పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం బడ్జెట్‌లోనైనా వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించి ఆదుకుంటారనుకుంటే అది కూడా లేదని తేలిపోయింది.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -