ఖరారు చేసిన ప్రపంచ చెస్ సమాఖ్య
న్యూఢిల్లీ : చదరంగం ప్రపంచకప్ భారత్ పశ్చిమ తీరాన్ని తాకనుంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగనున్న ఫిడె చెస్ ప్రపంచకప్‌కు గోవా ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య మంగళవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 206 మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు ఎనిమిది రౌండ్ల నాకౌట్ టోర్నమెంట్‌లో పోటీపడనున్నారు. ఈ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జీఎం.. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించనున్నారు. ప్రతి రౌండ్లో ఓడిన ఆటగాడు టోర్నమెంట్ నిష్క్రమించే ఫార్మాట్ ప్రపంచకప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రపంచ చెస్ గ్రాండ్‌మాస్టర్లకు ఆహ్లాదకర పోటీతత్వ వేదికతో పాటు అభిమానులకు చక్కటి పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని ఫిడె చెస్ ప్రపంచకప్‌కు గోవాను ఎంచుకున్నట్టు ఫిడె ఓ ప్రకటనలో తెలిపింది. 2002లో ఫిడె ప్రపంచకప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వగా.. విశ్వనాథన్ ఆనంద్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత్ నుంచి దొమ్మరాజు గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశిలు ప్రపంచకప్ టైటిల్‌పై కన్నేశారు. ‘భారత చెస్‌కు ఇది గర్వకారణం. ప్రపంచకప్‌ను గొప్పగా నిర్వహించేందుకు ఎదురుచూస్తున్నాం. ఈ ప్రపంచకప్ లక్షలాది మంది చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతుందని’ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నితిన్ నారంగ్ అన్నారు.