జూబ్లీహిల్స్ బైపోల్స్ చివరి రోజు అర్ధరాత్రి 2గంటల వరకు దాఖలు
ఉప ఎన్నికల నామినేషన్లలో స్క్రూట్నీ
పలువురివి తిరస్కరణ
ఆందోళనకు దిగిన అభ్యర్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎవరూ ఊహించని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీఎత్తున నామినేషన్‌లు దాఖలయ్యాయి. 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లను దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు వంద వరకు నామినేషన్‌లు దాఖలవుతాయని భావించినప్పటికీ అంతకు మూడు రెట్లు వచ్చాయి. చివరి రోజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన వారికే టోకెన్‌లు ఇచ్చి నామినేషన్‌లను స్వీకరించారు. 13వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో మొదటి రోజు 11 మంది 22 నామినేషన్లు దాఖలు చేయగా.. 18వ తేదీ వరకు మొత్తం 127 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 22న చివరి రోజు ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు అందజేయడం విశేషం.
ఆది, సోమవారం సెలవు కావడం, మంగళవారం ఒక్కరోజే అవకాశం ఉండటంతో అభ్యర్థులు భారీఎత్తున తరలివచ్చారు. అభ్యర్థులతో పాటు వారిని బలపరిచేందుకు వచ్చిన వారితో ఎన్నికల అధికారి కార్యాలయం ఆవరణ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా కిటకిటలాడింది. దాంతో చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన వారికే టోకెన్‌లు ఇవ్వగా.. అర్ధరాత్రి 2 వరకు నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్‌లను పరిశీలించే క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్‌లపై ఇరువైపులా కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్‌లను ఎన్నికల అధికారులు ఆమోదించారు.
పలువురి నామినేషన్లు తిరస్కరణ..అభ్యర్థుల ఆందోళన
వివిధ కారణాలతో కొంతమంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దాంతో ఎలాంటి కారణాలూ లేకుండా తమ నామినేషన్ తిరస్కరించారని కొంతమంది అభ్యర్థులు ఆర్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ కావాలనే తిరస్కరించారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. ఇదిలావుండగా, 24న నామినేషన్ల విత్ డ్రా చేసుకునే వారి సంఖ్య సైతం భారీగానే ఉండొచ్చని చర్చ జరుగుతోంది. కనీసం 150 మంది వరకు పోటీలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారీ సంఖ్యలో నామినేషన్లతో స్క్రూట్నీకి అధిక సమయం
నామినేషన్‌ల స్క్రూట్నీ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్క్రూట్నీ చేపట్టాలని రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. భారీ స్థాయిలో నామినేషన్‌లు దాఖలు కావడంతో స్క్రూట్నీకి అధిక సమయం పడుతోంది.
211 మంది అభ్యర్థులు..321 నామినేషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES