Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలు230 పనిదినాలు

230 పనిదినాలు

- Advertisement -

12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
ఉదయం 9 నుంచే తరగతులు
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 చివరి పనిదినం
ప్రార్థన అనంతరం రోజూ ఐదు నిమిషాలు యోగా, ధ్యానం
అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు ఎస్‌ఏ-1
ఏప్రిల్‌ 10 నుంచి 18 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు
పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచే తరగతులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే జయశంకర్‌ బడిబాట ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 19 వరకు కొనసాగనుంది. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలకు మొత్తం 230 పనిదినాలుంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 పాఠశాలలకు చివరి పనిదినం. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులుంటాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేశారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి పదో తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 28 నాటికి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో ప్రార్థన (అసెంబ్లీ) ముగిసిన తర్వాత ప్రతిరోజూ ఐదు నిమిషాలపాటు యోగా, ధ్యానం చేయాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరంలో బ్యాగ్‌లేని రోజులు పది ఉంటాయని వివరించారు. ప్రతినెలా మూడో శనివారం తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం (పీటీఎం) నిర్వహించాలనీ, గ్రీన్‌ అవర్‌, బాలసభ జరపాలనీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) సభ్యులను ఆహ్వానించాలని సూచించారు.
జులై 31 నాటికి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు జులై 31నాటికి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-1) పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. సెప్టెంబర్‌ 30 నాటికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు జరపాలని పేర్కొన్నారు. అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలుంటాయని వివరించారు. డిసెంబర్‌ 23నాటికి ఎఫ్‌ఏ-3 పరీక్షలుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నాటికి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నాటికి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలుంటాయని వివరించారు. ఏప్రిల్‌ పది నుంచి 18 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీలోపు పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలను జరుపుతామని పేర్కొన్నారు. మార్చిలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలుంటాయని వివరించారు.
సెప్టెంబర్‌ 26 నాటికి రాష్ట్రస్థాయి క్రీడలను పూర్తి చేయాలి
ఈ ఏడాది సెప్టెంబర్‌ 26 నాటికి రాష్ట్రస్థాయిలో క్రీడలను పూర్తి చేయాలని యోగితారాణా ఆదేశించారు. అక్టోబర్‌లో జాతీయ స్థాయిలో క్రీడలుంటాయని వివరించారు. ఆగస్టు మొదటి, రెండో వారంలో పాఠశాల స్థాయి, మూడో వారంలో జోనల్‌ స్థాయి (జిల్లా టీంల ఎంపిక) క్రీడలను నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్‌ రెండో వారంలో జిల్లా స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ను చేపట్టాలని కోరారు. అదేనెల నాలుగోవారంలో రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహించాలని తెలిపారు. డిసెంబర్‌ 22న రాష్ట్రస్థాయిలో మ్యాథమెటిక్స్‌ సెమినార్‌ను జరపాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రస్థాయిలో సైన్స్‌ సెమినార్‌ను నిర్వహించాలని సూచించారు.
పాఠశాలల పనివేళలు :
ఉన్నత పాఠశాలలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు
(హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ప్రాథమికోన్నత పాఠశాలలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు
(హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ప్రాథమిక పాఠశాలలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
(హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు)
పండుగ సెలవులు
దసరా సెలవులు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు (13 రోజులు)
క్రిస్మస్‌ సెలవులు (మిషినరీ స్కూళ్లకు) డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు (ఐదు రోజులు)
సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15 వరకు (ఐదు రోజులు)
అకడమిక్‌ క్యాలెండర్‌లో
ముఖ్యాంశాలు
– జూన్‌ 6 నుంచి 19 వరకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమం
– జూన్‌ 12 నుంచి బడులు పున:ప్రారంభం
– జులై 31 నాటికి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
– సెప్టెంబర్‌ 30 నాటికి ఎఫ్‌ఏ-2 పరీక్షలు
– అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు
– డిసెంబర్‌ 23 నాటికి ఎఫ్‌ఏ-3 పరీక్షలు
– ఫిబ్రవరి 7 నాటికి పది విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలు
– ఫిబ్రవరి 28 నాటికి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎఫ్‌ఏ-4 పరీక్షలు
– ఏప్రిల్‌ 10 నుంచి 18 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు
– ఫిబ్రవరి 28 నాటికి ముందే టెన్త్‌ ప్రీ ఫైనల్‌
– మార్చిలో టెన్త్‌ పరీక్షలు
– స్కూళ్లకు చివరి పనిదినం ఏప్రిల్‌ 23
– 2025-26 విద్యాసంవత్సరంలో మొత్తం పనిదినాలు 230
– ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad