Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలు కొనాలి

ఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలు కొనాలి

- Advertisement -

మార్క్‌ఫెడ్‌ సీఎండీకి మంత్రి తుమ్మల ఆదేశం
– కేంద్రం జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యల్ని పరిష్కరించాలి
– పత్తి రైతులకు అన్యాయం చేయొద్దు
– రైతులకు భూసార పరీక్ష పత్రాల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు మక్కలను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతులు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కాటన్‌ అసోసియేషన్‌ బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 214 మక్కల కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 125 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. 23,131 మెట్రిక్‌ టన్నుల మక్కల్ని సేకరించామన్నారు. రాష్ట్రంలో 2,500 కోట్లతో మక్కల్ని కొనుగోలు చేస్తామన్నారు. అలాగే ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన విధించడం సరికాదన్నారు. పత్తి రైతులకు అన్యాయం చేయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియలు సవ్యంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రవీందర్‌ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా సీసీఐ సీఎమ్‌డీ లలిత్‌కుమార్‌ ఉప్తాతో ఫోన్‌లో సంప్రదించారు. సీసీఐ అవలంబిస్తున్న ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 అలాట్‌మెంట్‌ విధానాన్ని ఎత్తేయాలనీ, అన్ని జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లకు అనుమతులివ్వాలని విన్నవించారు. జిన్నింగ్‌ మిల్లులు మూతపడే పరిస్థితులు తీసుకురావొద్దని కోరారు. కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి కొనుగోళ్లలో సాంకేతికంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమనీ, రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు ఇబ్బందులు లేకుండా కనీస మద్దతు ధర వద్ద కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. తేమ శాతం, స్లాట్‌ బుకింగ్‌ వంటి అంశాలపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల కొనుగోలు పరిమితిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన సవరణలు చేయాలని కోరారు. సీసీఐ కొత్త నిబంధనలు, జిన్నింగ్‌ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు చొరవ తీసుకోవాలని కోరారు. రైతాంగానికి సహాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే విశ్వాసం తనకుందన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ బి. గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మి బాయి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు.
భూసార పరీక్ష పత్రాల పంపిణీ
రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన రైతులకు భూసార పరీక్షల పత్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. రైతుల నుద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవడం వలన వారి భూములలో ఎంత శాతం పోషకాలు ఉన్నాయో తెలుస్తాయన్నారు. తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఎంత మోతాదులో ఎరువులు అవసరం అవుతుందో తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. భూసార పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన పెరిగి, ఎరువులపై రైతులు చేసే ఖర్చు తగ్గడమే కాకుండా భూమి యొక్క ఆరోగ్యం కూడా కాపాడినట్లు అవుతుందని అన్నారు. శాటిలైట్‌ టెక్నాలజీతో మట్టి పరీక్షలు చేసే కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు వరి, పత్తి పంటల బదులు ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేపట్టాలనీ, ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క, సాగు చేయడం వలన ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటల సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -