ఫిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి : విశాఖపట్నంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఎకరం 99 పైసల చొప్పున 27.10 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చిందంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. ఎకరా 99 పైసల చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారో లేదో చెప్పాలని ఆదేశించింది. దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తే ఇతర కంపెనీలు కూడా రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపేవని అభిప్రాయపడింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. రహేజాకు భూ కేటాయింపులకు అమలు చేసిన విధానాన్ని కూడా నిషేధించాలంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం, మధురవాడ, ఐటి హిల్‌లో ఎకరా 99 పైసల చొప్పున 27.10 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ రహేజా కార్ఫ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్సిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షులు, మానవ హక్కుల కమిషన్ పూర్వ సభ్యుడు జి శ్రీనివాసరావు వేసిన పిల్‌పై విచారణను వాయిదా వేసింది. తొలుత సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం దారుణమన్నారు. భూమిని రక్షించే ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా ధారాదత్తం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఎకరా 99 పైసలు చొప్పున 27 ఎకరాలు ఇచ్చిందన్నారు. జిఓ 204ను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్ సంస్థకే ప్రభుత్వం భూమి ఇచ్చిందని తేలుతుందన్నారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రతిపాదన చేస్తూ, కంపెనీలకు భూ కేటాయింపులపై ఇప్పటికే పిల్ విచారణలో ఉందని, పిటిషనర్ భూ కేటాయింపులను సవాల్ చేశారన్నారు. ప్రభుత్వ కౌంటర్ నిమిత్తం విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
‘రియల్’ సంస్థలకు 99 పైసలకే 27 ఎకరాలు
- Advertisement -
- Advertisement -



