రెండు ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతి
గూడ్స్ వాహనాలకు జీవితకాలానికి పన్ను
పలు బిల్లులకు శాసనసభ, శాసనమండలి ఆమోదం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వివిధ శాఖలకు సంబంధించిన పలు బిల్లులను శాసనసభ, శాసనమండలి ఆమోదించింది. మున్సిపల్ విద్యా, రవాణా, పంచాయతీ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన చట్టాలకు పలు సవరణలను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. శుక్రవారం అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి తరుపున ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మున్సిపల్ చట్టానికి సవరణలు ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయివేటు విశ్వవిద్యాలయ బిల్లుకు మంత్రి దామోదర రాజనర్సింహ, రవాణా చట్టానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవరణలు ప్రతిపాదించారు. వీటిపై బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అభ్యంతరాలను లేవనెత్తారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మున్సిపాల్టీల విలీనం, సిబ్బంది కొరతపై ప్రధానంగా ప్రస్తావించారు. గ్రేటర్‌లో విలీనం వల్ల పేదలు, మధ్యతగరతి వర్గాలపై పన్ను భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రేష్, ఐవోలు గ్రామాలను గ్రేటర్‌లో కలపాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీయకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విలీనమవుతున్న మున్సిపాల్టీల్లో అదనపు పన్నుల భారం ఉండబోదని భరోసా ఇచ్చారు. దీని వల్ల సమర్థవంతమైన పౌర సేవలు అందుతాయని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌ను సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలు, పౌరసేవల్లో అసమగ్రత ఉందనీ, ఈ చట్టం ద్వారా వాటిని సరి చేస్తామన్నారు. సుస్థిర అభివృద్ధి, సమగ్ర పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. మున్సిపాల్టీలపై వివిధ స్థాయిల్లో ప్రజల అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిపారు. విలీన ప్రక్రియతో గ్రామాల్లో ఉపాధి కోల్పోతున్నారనీ, ఈ రాష్ట్రంలో పేదలకు ఎలాంటి సాయం చేస్తున్నారంటూ బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా ఆక్షేపించారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీకి ఈ చట్టం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును వ్యతిరేకిస్తున్నాం :కూనంనేని
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తెలంగాణ ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని సీపీఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా ప్రయివేటుకు ఊతం ఇవ్వడం సరైందికాదన్నారు. విద్యారంగంలోకి ప్రయివేటు సంస్థలను ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టడమంటే, పేదలను విద్యకు దూరం చేయడమేనని అన్నారు. అనేక దేశాల్లో విద్య, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని గుర్తుచేశారు. బీజేపీ సభ్యులు హరీశ్‌బాబు మాట్లాడుతూ ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉంటాయా? ఫీజు రీయింబర్స్ మెంట్, ఫీజు రాయితీలు ఉంటా యా? అని ప్రశ్నించారు.
ఇవి మైనార్టీయా, నాన్ మైనార్టీయా, ప్రయివేటు సంస్థలా ? చెప్పాలంటూ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ నిలదీశారు. వీటికి భూమి, వాటర్, కరెంట్ ఇస్తున్నామనీ, దీంతో తెలంగాణ విద్యార్థులకు వచ్చే ప్రయోజన మేంటని ప్రశ్నించారు. రవాణా చట్టంతో గూడ్స్ వాహనాలపై తీవ్ర భారం పడుతుందని బీజేపీ సభ్యులు హరీశ్‌బాబు విమర్శించారు. ప్రతిగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఈ చట్టాన్ని విపక్షాలు అవగాహన చేసుకోవడం లేదన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై జనవరి మొత్తం మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారతదేశంలోనే తొలి రిహాబిలిటేషన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల మంత్రి దామోదర సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖకు సంబం ధించిన బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది.



