జాతీయ మహాసభ నేపథ్యంలో ప్రచార, సన్నాహక కార్యక్రమాలు
నవతెలంగాణ- విలేకరులు
ఐద్వా 14వ జాతీయ మహాసభ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం పలు జిల్లాల్లో 2కే రన్, పోస్టర్ల ఆవిష్కరణ, ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ముషీరాబాద్ బాపూజీనగర్ కమ్యూనిటీ హాల్ నుంచి ఈ రన్ ప్రారంభించారు. అనంతరం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి మాట్లాడారు. మహాసభ ప్రచారం నగరంలో విస్తృతంగా జరుగుతోందని, వివిధ కూడళ్లలో బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టించి, వాల్ రైటింగ్స్ రాయించినట్టు తెలిపారు.
ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు 2కే రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యంలో బెలూన్లు ఎగరవేస్తూ 2కే రన్ ప్రారంభించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఐద్వా గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు జంపాల అండాలు, నాయకులు బెలూన్స్ ఎగరవేశారు. నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్లులో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. జాతీయ మహాసభ బహిరంగ సభకు ఇంటికో మహిళ తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.



