Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంశాత్రాజ్‌పల్లిలో 30పడకల ఆస్పత్రి

శాత్రాజ్‌పల్లిలో 30పడకల ఆస్పత్రి

- Advertisement -

– వేములవాడను వైద్యానికి హబ్‌గా మారుస్తాం
– ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం
– ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
– గుడి చెరువు సుందరీకరణ, యూపీహెచ్‌సీ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – వేములవాడ

శాత్రాజ్‌పల్లిలో 30పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంతం వైద్యానికి హబ్‌గా మారుతుందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో రూ.1.43కోట్లతో అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ) నిర్మాణానికి ఆదివారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అలాగే, వేములవాడ పట్టణంలో తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి చెక్‌ డ్యామ్‌ వరకు, మిగిలిన బండ్‌ అభివద్ధి, సుందరీకరణ పనులకు ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాత్రాజ్‌పల్లి చైతన్యవంతమైన ప్రాంతమని, ఎందరో ప్రభుత్వ ఉద్యోగులను అందించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సైడ్‌ డ్రైన్‌ నిర్మాణానికి రూ.12లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. తిప్పాపూర్‌ నుంచి మూలవాగు ఎడమవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రూ.80 లక్షలతో సుందరీకరణ పనులు ప్రారంభించామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేశామని, ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. రాజన్న గుడి చెరువులోకి మురుగు నీరు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక చొరవతో ఈ హెల్త్‌ సెంటర్‌ ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రాజు, వైస్‌ చైర్మెన్‌ రాకేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, స్థానిక ప్రజాప్రతినిధులు చంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, సంఘ స్వామి యాదవ్‌, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -