– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 30 వేల మంది యువ రైతులకు సాయిల్ హెల్త్ వాలంటీర్లుగా శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, పంటలకనుగుణంగా ఎరువుల వినియోగం వంటి అంశాలపై వాలంటీర్లకు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రయివేట్ భాగస్వామ్యంతో క్లస్టర్ స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణ పొందిన వాలంటీర్లు గ్రామ స్థాయిలో రైతులకు భూసార పరీక్షలకు సహకరించడంతో పాటు, వాటి ఫలితాల ఆధారంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగంపై సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల శాస్త్రీయంగా ఎరువుల వినియోగం, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని తుమ్మల తెలిపారు. ఈ సందర్భంగా యూరియా యాప్‌పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్‌తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని పలువురు రైతులు తెలిపారు. ఇంట్లో నుంచే యూరియాను బుక్ చేసుకుని, ఉచిత సమయంలో తెచ్చుకునేందుకు వీలు కలిగిందన్నారు. రైతుల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రైతులకు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. పామాయిల్ పంటకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఆదిశగా ఆలోచించాలని తుమ్మల కోరారు. పామాయిల్ పంటలో అంతర్‌పంటగా వరి, పత్తి, మొక్కజొన్న లాంటివి సాగు చేసుకోవచ్చని వివరించారు.
డంప్‌యార్డ్ ఏర్పాటు విరమించుకోండి : తుమ్మలకు హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గం వినతి
హుజురాబాద్‌లో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని మంత్రి తుమ్మలకు హుజురాబాద్ మున్సిపల్ పాలక వర్గం విజ్ఞప్తి చేసింది. మంగళవారం హుజురాబాద్ మున్సిపల్ చైర్మెన్, కౌన్సిలర్లతో పాటు నియోజకవర్గంలోని పలువురు సర్పంచ్‌లు మంత్రిని కలిసి డంప్ యార్డ్ ఏర్పాటు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు.
సాయిల్ హెల్త్ వాలంటీర్లుగా 30 వేల మందికి శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



